వికసిత్ భారత్ లక్ష్యసాధనకు ఎన్‌ఎస్‌ఐ కృషి
లాలాపేట: ఐసీఎంఆర్–జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్)లో న్యూట్రిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఐ) 57వ వార్షికోత్సవ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సంవత్సరం ‘సుపోషిత్ భారత్ ఫర్ ఏ వికసిత్ భారత్’ అనే థీమ్‌తో ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డా.భారతి కులకర్ణి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎన్‌ఎస్‌ఐ ప్రసిడెంట్ డాక్టర్ శరత్ గోపాలన్ పాల్గొని ముఖ్య ప్రసంగం చేశారు. వికసిత్ భారత్–2047 లక్ష్యాలను సాధించడానికి పోషకాహారం ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఆరోగ్యకరమైన, బలమైన, మంచి పోషకాహారంతో కూడిన భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి న్యూట్రిషన్ సైంటిస్టులు చేస్తున్న కృషి అమోఘమన్నారు. సదస్సులో ఎన్‌ఐఎన్ మాజీ డైరెక్టర్ డా.హేమలత, ఎన్‌ఎస్‌ఐ వైస్ ప్రసిడెంట్ డా.రాజుసింగ్ చిన్నా, ఎన్‌ఎస్‌ఐ సెక్రటరీ డా.సుబ్బారావు, ఎన్‌ఎస్‌ఐ వైస్ ప్రసిడెంట్ డా.భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం సదస్సు సావనీర్‌ను ఆవిష్కరించారు. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ వార్షిక సదస్సులో దేశ వ్యాప్తంగా దాదాపు 1300 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.


