కోహెడలో తాత్కాలిక మార్కెట్ నిర్మించాలి
సాక్షి, సిటీబ్యూరో: బాటసింగారంలో కొనసాగుతున్న తాత్కాలిక మార్కెట్‌కు ప్రతి నెలా రూ.80 లక్షలు అద్దెలు చెల్లిస్తున్నారని, తద్వారా రూ.50 కోట్లు మార్కెట్ ఆదాయం వృథా అయ్యాయని తెలంగాణ ఫ్రూట్ మార్కెట్ కమీషన్ ఏజెంట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు క్రాంతి ప్రభాత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం మీడియాతోమాట్లాడుతూ కోహెడలోని మార్కెట్ స్థలంలో తాత్కాలిక మార్కెట్ నిర్మించి అద్దె భారాన్ని తగ్గించాలని సూచించారు. మార్కెట్‌పై ఆధారపడిన 20 వేల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు. ప్రస్తుతం బాటసింగారం మార్కెట్‌లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవని, దీంతో రైతులు, కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కోహెడలో రూ.10–15 కోట్లు వెచ్చించి అన్ని సౌకర్యాలతో మార్కెట్ నిర్మించవచ్చని, అలా చేస్తే నెలకు రూ.80 లక్షలు అద్దె మిగులుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైవేట్ స్థలంలో ఉందని, ఈ స్థలాలు స్థానిక కమీషన్ ఏజెంట్లు, వారి బంధువులవేనని ఆయన ఆరోపించారు. మామిడి సీజన్ కోసం స్థలాలు తీసుకుని మూడు రెట్లు అధికంగా అద్దె చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.


