అంచనాలకు మించి! | - | Sakshi
Sakshi News home page

అంచనాలకు మించి!

Nov 3 2025 3:19 PM | Updated on Nov 3 2025 3:19 PM

అంచనా

అంచనాలకు మించి!

ఆ సెక్షన్లలో అధికం

సాక్షి, రంగారెడ్డిజిల్లా: మెట్రోజోన్‌ సహా మేడ్చల్‌, రంగారెడ్డిజోన్ల పరిధిలో ప్రస్తుతం 60 లక్షలకుపైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 53 లక్షల గృహ, ఎనిమిది లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. కోర్‌సిటీలో పెద్దగా నిర్మాణాలు లేవు. కొత్త కనెక్షన్ల కోసం వస్తున్న దరఖాస్తులు కూడా అంతంతే. శివారులోని అమీన్‌పూర్‌, పటాన్‌చెరు, మేడ్చల్‌, కీసర, జీడిమెట్ల, హబ్సీగూడ, సరూర్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, కందుకూరు, రాజేంద్రనగర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, ఇబ్రహీంబాగ్‌, షాద్‌నగర్‌ డివిజన్ల పరిధిలో కొత్తగా అనేక విల్లాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, పరిశ్రమలు పుట్టకొస్తున్నాయి. వీరంతా విద్యుత్‌ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రేటర్‌ జిల్లాల నుంచి ప్రతి నెలా 35 వేల మంది కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మల్టీ స్టోరేజ్‌ భవనాలు, విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీల కోసం పెద్ద సంఖ్యలో ఎల్‌టీఎం (లో టెన్షన్‌ మీటరింగ్‌) దరఖాస్తులు వస్తుంటాయి. 20 కిలోవాట్ల సామర్థ్యం మించితే విధిగా ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టుకోవాలనే నిబంధన ఉంది. 20 కిలోవాట్లు దాటిన ఏదైనా ఒక బహుళ అంతస్తుల భవనానికి విద్యుత్‌ కనెక్షన్‌ కావాలంటే ముందు డిస్కంకు దరఖాస్తు చేసుకోవాలి. లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, ఏఈలు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎగ్జిస్టింగ్‌ లైన్‌కు కొత్తగా నిర్మించే భవనానికి మధ్య ఉన్న దూరం సహా అంత స్తులు, అందులోని ఫ్లాట్ల విస్తీర్ణం, భవిష్యత్తు విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ అంచనాలు రూపొందిస్తారు. ఒకే తరహా పనికి ఒక్కో ఇంజనీర్‌ ఒక్కో విధంగా ఎస్టిమేషన్లు వేస్తున్నారు. ముందే అడిగినంత ముట్టజెప్పిన వారికి తక్కువ ఖర్చుతో, నిరాకరించిన వారికి ఎక్కువ ఖర్చుతో ఎస్టిమేషన్లు వేస్తున్నారు. దీనిలో పది శాతం సూపర్‌ వైజింగ్‌ చార్జీని డిస్కంకు చెల్లించి.. వినియోగదారుడే స్వయంగా ఆ పనిని ప్రైవేటు కాంట్రాక్టర్లతో చేయించుకోవాల్సి ఉంది.

అడ్డగోలు వ్యవహారాలు

క్షేత్రస్థాయిలోని కొంత మంది ఏఈలు వర్క్‌ ఎస్టిమేషన్ల పేరుతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారు. చేయి తడిపితే ఒకలా.. లేదంటే మరోలా అంచనాలు తయారు చేస్తున్నారు. ఆశించిన విధంగా ఎస్టిమేషన్‌ తయారు చేయాలంటే ముందే ఏఈకి రూ.20 వేలు, ఏడీఈ రూ.10 వేలు, డీఈకి రూ.10 వేలు, ఎస్‌ఈకి రూ.10 వేలు చెల్లించాల్సి వస్తోంది. తర్వాత వర్క్‌ఆర్డర్‌కు ఏఈ, ఏడీఈలకు రూ.10 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఒక్కో పనికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. మెటీరియల్‌ ధరల్లోనూ భారీ వ్యత్యాసాలు ఉండటం ఇబ్బందిగా మారింది. బహిరంగ మార్కెట్లో రూ.10 వేలకు లభించే వస్తువుకు.. డిపార్ట్‌మెంట్‌లో రూ. 15 వేలకుపైగా ఖర్చవుతోంది. తీరా పని పూర్తయిన తర్వాత డీటీఆర్‌ చార్జింగ్‌ సమయంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకు లింకు పెట్టి లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ మొదలు ఉన్నతాధికారుల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అదనపు చెల్లింపులు భారంగా మారుతుండటంతో విధిలేని పరిస్థితుల్లో వినియోగదారులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఎక్కువగా ఏడీఈలు, ఏఈలు, లైన్‌ ఇన్‌స్పెక్టర్లు ఏసీబీకి పట్టుబడుతుండమే దీనికి నిదర్శనం. ఇప్పటికే ఒకసారి పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు రెండోసారి కూడా ఇదే కేసులో పట్టుబడుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. పెద్ద అంబర్‌పేట్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా మెదక్‌ డీఈ కూడా రెండు సార్లు ఏసీబీకి చిక్కిన వాళ్ల జాబితాలో ఉండటం గమనార్హం.

శివారు ప్రాంతానికి చెందిన ఓ వినియోగదారుడు తనకున్న మూడు వందల గజాల్లో నాలుగు అంతస్తుల భవనం నిర్మించాడు. ఒక్కో ఫ్లోర్‌లో రెండు ఫ్లాట్ల చొప్పున మొత్తం ఎనిమిది త్రీఫేజ్‌ విద్యుత్‌ మీటర్లకు దరఖాస్తు చేసుకున్నాడు. ఒక్కో మీటర్‌ ఐదు కిలోవాట్ల చొప్పున మొత్తం 40 కిలోవాట్లు డిమాండ్‌ ఉన్న ఈ భవనానికి ఎగ్జిస్టింగ్‌ మీటర్‌తో కలిపి విద్యుత్‌ డిమాండ్‌ 45 కిలోవాట్లకు చేరింది. ఇందుకు 63 కేవీఏ సామర్థ్యంతో డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, 35 స్క్వైర్‌ ఎంఎం సామర్థ్యంతో 11 కేవీ కేబుల్‌, ఒక పోలు, ఒక ఏబీ స్విచ్‌, ఫ్యూజ్‌ సర్క్యూట్‌, డీటీఆర్‌ బాక్స్‌, ఐదు ఎర్తింగ్‌ ఫిట్స్‌, డీటీఆర్‌ నుంచి ప్యానల్‌ బోర్డు వరకు కేబుల్‌, ఒక ప్యానల్‌ బోర్డు అవసరం. ఇందుకు సుమారు రూ.2.50 లక్షలు ఖర్చవుతుంది. అవగాహన లేమి, అడిగినంత ఇవ్వలేదనే సాకుతో సదరు ఇంజినీరు ఇదే పనికి అంచనాలకు మించి ఎస్టిమేషన్‌ వేసినట్లు తెలిసింది.

ఒకే పనికి భిన్నంగా ఎస్టిమేషన్లు

ఒక్కో ఇంజినీరు ఒక్కో విధంగా రూపకల్పన

అడిగినంత ఇస్తే కాస్ట్‌ తగ్గింపు.. లేదంటే పెంపు

వర్క్‌ ఆర్డర్లు, ఎన్‌ఓసీల పేరుతో అడ్డగోలు వసూళ్లు

ఏఈ నుంచి ఎస్‌ఈ వరకు చేయి తడపాల్సిందే..

డిస్కంలో అవినీతి తంతు

శివారులోని కాటేదాన్‌, హిమాయత్‌సాగర్‌, శంషాబాద్‌, చిలుకూరు, మోకిల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌, జీడిమెట్ల, కీసర, మేడ్చల్‌, షాపూర్‌నగర్‌, ప్రగతినగర్‌, బోయినపల్లి, నారపల్లి, వనస్థలిపురం, పెద్ద అంబర్‌పేట్‌, తుర్కయంజాల్‌ వంటి శివారు సెక్షన్ల పరిధిలోని ఇంజనీర్లు ఎస్టిమేషన్లు, వర్క్‌ ఆర్డర్ల పేరుతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఒకరి తర్వాత మరొకరు ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఆరు నెలల తర్వాత తిరిగి అదే పోస్టులో చేరి.. మళ్లీ ఏసీబీకి చిక్కుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.

అంచనాలకు మించి! 1
1/1

అంచనాలకు మించి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement