రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
● ముగ్గురు యువకులకు గాయాలు ● బీబీనగర్‌లో ఘటన
బీబీనగర్, రాజాపేట: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండల కేంద్రానికి చెందిన గర్ధాసు నర్సింహులు, మహేశ్వరి దంపతుల కుమారుడు గర్ధాసు ప్రశాంత్(32)కు వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన ప్రసూన(28)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారు ప్రస్తుతం మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా బోడుప్పల్‌లోని టెలిఫోన్ కాలనీలో నివాసముంటున్నారు. ప్రశాంత్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం భార్యాభర్తలిద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై భువనగిరి వైపు వస్తూ.. బీబీనగర్ పెద్ద చెరువు వద్ద హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి పక్కన ఆగారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మహేంద్ర థార్ వాహనం వారిని ఢీకొట్టింది. దీంతో ప్రసూన బైక్‌తో పాటు చెరువులో పడిపోగా ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో పడిన ప్రసూనను బయటకు తీయగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహేంద్ర థార్ వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ షణ్ముఖ్‌తో పాటు డోర్నాల భార్గవ్, కొండ సైరిత్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గర్ధాసు ప్రశాంత్ మృతితో రాజాపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
హిమాయత్‌నగర్: మానవీయ సమాజం కోసం జీవితకాలమంతా పోరాడిన వ్యక్తి ప్రొఫెసర్ సాయిబాబా అని, ఈ విషయంపై సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో ప్రొ.సాయిబాబా స్మారకోపన్యాసంలో భాగంగా ‘అసమ్మతి గళాలు–సాహిత్యం, ప్రజాస్వామ్య వరివర్తనలు రచయితల పాత్ర’ అనే అంశంపై చర్చా కార్యక్రమం ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కవి, రచయిత్రి మీనా కందస్వామి, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి, ఆర్ధికవేత్త డి.నరసింహారెడ్డి హాజరై మాట్లాడారు. ముందుగా హరగోపాల్ అధ్యక్షోపన్యాసం చేస్తూ తాను నమ్మిన విశ్వాసం కోసం ప్రొఫెసర్ సాయిబాబా తన జీవితాన్ని ధారపోశారని అన్నారు. పదేళ్ల పాటు జైలులో ఉన్నా అధైర్య పడలేదన్నారు. జైలు నుంచి బయటకొచ్చాక సమాజానికి చాలా సేవ చేయాల్సిన దశలో సాయిబాబా మన మధ్య లేకపోవడం విషాదకరమని అన్నారు. ఈ సమావేశంలో సాయిబాబా మెమోరియల్ కమిటీ సభ్యులు రాందేవ్, కాత్యాయని విద్మహే, సాయిబాబా కూతురు మంజీర తదితరులు పాల్గొన్నారు.
నాలుగో అంతస్తు పైనుంచి కిందపడి...
కవాడిగూడ: ఓ భవనానికి పెయింటింగ్ వేస్తూ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ పెయింటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5 రత్నం రేఖ అపార్ట్‌మెంట్ వద్ద చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎండీ అంజద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం..ఎల్‌బీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన బానోతు వీరన్న (45) వృత్తిరిత్యా పెయింటర్. ఆదివారం ఉదయం 10.30 గంటలకు రత్నరేఖ అపార్ట్‌మెంట్‌లో నాలుగోఅంతస్తులో పెయింటింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద జారిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న దోమలగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన వీరన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.


