మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకం
● ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, ఐద్వా వ్యవస్థాపకుల్లో ఒకరైన మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి కొనియాడారు. మల్లు స్వరాజ్యం జీవితానికి సంబంధించిన ‘నా మాట తుపాకి తూటా’ ఆంగ్ల అనువాదం ‘ది ఫైర్ ఆఫ్ డెఫియెన్స్’ పుస్తకాన్ని పుణ్యవతి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. వీరోచిత పోరాటానికి మారు పేరుగా నిలిచిన మల్లు స్వరాజ్యం జీవితాన్ని ప్రపంచమంతా తెలుసుకునేలా ఆమె జీవితం, ఉద్యమ చరిత్రను ఆంగ్లంలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఐద్వా జాతీయ అధ్యక్షురాలు ఆర్.అరుణ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఉపాధ్యక్షురాలు టి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
సందడిగా తెలుగు–వెలుగు
ఖైరతాబాద్: యువ భారతి, ఐఐఎంసీ కళాశాల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం లక్డీకాపూల్‌లోని ఐఐఎంసీ కళాశాలలో తెలుగు వెలుగు కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి మొదట ఆచార్య ఫణీంద్ర రచించిన భారత భారతి, డాక్టర్ కె.వి. కృష్ణ కుమారి రచించిన భద్రా కళ్యాణం గ్రంథాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మహాభారతం మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దే మహాకావ్యమని అన్నారు. యువభారతి వ్యవస్థాపక సమావేశకర్త, ఐఐఎంసీ కళాశాల చైర్మన్ వంగపల్లి విశ్వనాథం మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యాలను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో తెలుగు వెలుగు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువభారతి ప్రధాన సంపాదకులు బి.జయరాములు తదితరులు పాల్గొన్నారు.
మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకం


