జూబ్లీహిల్స్‌లో పేదలకోసం పనిచేసే వ్యక్తికే ఓటు వేయండి
● జస్టిస్ చంద్రకుమార్
పంజగుట్ట: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కాకుండా వామపక్ష, సెక్యులర్ భావాలు ఉండి, పేద ప్రజలకోసం ఆలోచించే వారికి ఓటు వెయ్యాలని జాగో తెలంగాణ వ్యవస్థాపకుడు జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మతతత్వ బీజేపీ, 10 సంవత్సరాల పాటు తెలంగాణను దోచుకున్న బీఆర్‌ఎస్‌కు ఓటు వెయ్యరాదని తాము ప్రచారం చేసి, కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ఎంతో తోడ్పాటు ఇచ్చామని పేర్కొన్నారు. కానీ గెలిచిన తరువాత రేవంత్ ప్రభుత్వం అదానీకి కాంట్రాక్ట్‌లు ఇవ్వడం, మతతత్వ పార్టీ అయిన ఎంఐఎంను దగ్గరకు తియ్యడం, రైతులనుంచి భూములు లాక్కోవడం వంటి చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జాగో తెలంగాణ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లో మన స్టాండ్ ఎటు అనే అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు అనుకూల విధానాన్ని అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో కేవలం 350 కుటుంబాల వద్ద 167 లక్షల కోట్ల ఆస్తి ఉండటమే ఇందుకు నిదర్శనమని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.


