గ్లోబల్‌ టూరిస్టులను ఆకర్షించేలా ప్రత్యేక పాలసీ | - | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ టూరిస్టులను ఆకర్షించేలా ప్రత్యేక పాలసీ

Oct 17 2025 7:53 AM | Updated on Oct 17 2025 7:53 AM

గ్లోబల్‌ టూరిస్టులను ఆకర్షించేలా ప్రత్యేక పాలసీ

గ్లోబల్‌ టూరిస్టులను ఆకర్షించేలా ప్రత్యేక పాలసీ

పర్యాటక శాఖ మంత్రి జూపల్లి

లాలాపేట: గ్లోబల్‌ టూరిస్టులను ఆకర్షించేలా ప్రత్యేక పాలసీ అమలు చేసి తెలంగాణ టూరిజాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఉస్మానియా యూనివర్సిటీలోని కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘ గ్లోబల్‌ టూరిజం ఏ న్యూ అవెన్యూస్‌ అండ్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ ‘ అంశంపై చేపట్టిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిఽథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్థులు, అధ్యాపకుల పాత్ర ఎనలేనిదన్నారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తున్నామన్నారు. ఉద్యోగాల కల్పనలో టూరిజం పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. టూరిజంలో దేశం, తెలంగాణ వెనుకబడి ఉన్నాయన్నారు. సింగపూర్‌, దుబాయ్‌తో పోటీ పడి టూరిజాన్ని ప్రమోట్‌ చేయడం ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు దక్కుతాయన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో చారిత్రక కట్టడాలు, సుందరమైన ప్రదేశాలు, నదీ జలాలు, అటవీ ప్రాంతాలు ఉన్నాయి. టూరిజంలో మౌలిక వసతులు లేక అభివృద్ధికి నోచుకోలేదన్నారు. హైదరాబాద్‌ నగరంలో ఇటీవల నిర్వహించిన మిస్‌ వరల్డ్‌ పోటీలతో రాష్ట్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేడానికి కొంత ఉపయోగపడిందన్నారు.

పదేళ్లుగా టూరిజం పాలసీ లేదు.

గత 64 ఏళ్ల కాలంలో 22 మంది ముఖ్యమంత్రులు పాలనలో రాష్ట్రంలో ఉన్న రూ. 70 వేల కోట్లు అప్పులు ఉంటే, గత ప్రభుత్వ హయాంలో రూ. 8 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. గడచిన పదేళ్ల కాలంలో రాష్ట్రంలో టూరిజం పాలసీ లేదని సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో ప్రత్యేక టూరిజం పాలసీని రూపొందించామన్నారు. ప్రస్తుతం టూరిజం ద్వారా వస్తున్న ఆదాయం రూ.12 కోట్లు మాత్రమే అన్నారు. టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్‌ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. తద్వారా పర్యాటక రంగాన్ని, తెలంగాణ సంస్కృతి, కళలను అభివృద్ది చేస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రముఖ ప్రాత పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రమోట్‌ చేసేలా నూతన విధానలను ఆవిష్కరించాలని కోరారు. వారంలో రెండు రోజుల పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించి అక్కడ రీల్స్‌ చేసి సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం తెలంగాణ టూరిజంపై రూపొందించిన హిందీ పాటను స్వయంగా తన సెల్‌ఫోన్‌ ద్వారా విద్యార్థులకు వినిపించారు.

● మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణలో ప్రకృతి ప్రసాదించిన ఆకుపచ్చ తెలంగాణ, సస్యశ్యామలమైన తెలంగాణగా పేర్కొన్నారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి ఓయూ విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. పర్యాటక ప్రాంతాలపై సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేసేలా ఓ ప్రత్యేకమైన ఆధునిక విధానాన్ని రూపొందించాలని కోరారు. ఎమ్మెల్సీ డా. అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ ఓయూ ఆర్ట్స్‌ కళాశాలను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం సదస్సు సావనీర్‌ను ఆవిష్కరించారు. ఓయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఐపీఈ డైరెక్టర్‌ ప్రొ శ్రీనివాసమూర్తి, సదస్సు చైర్మన్‌ ప్రొ గంగాధర్‌, కాన్ఫరెన్స్‌ డైరెక్టర్‌ ప్రొ. డి. చెన్నప్ప, కన్వీనర్లు కృష్ణచైతన్య, ఇంద్రకాంతి శేకర్‌, ప్యాట్రిక్‌, వివిధ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.

పర్యాటకరంగం అభివృద్ధితోప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాల కల్పన

ఓయూ విద్యార్థులు టూరిజాన్ని ప్రమోట్‌ చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement