
అద్దెకు తీసుకుని అమ్మేస్తారు..
చిలకలగూడ : ఎక్కువ అద్దె చెల్లిస్తామని నమ్మించి కార్లను అద్దెకు తీసుకుంటారు. రెండు నెలలు సక్రమంగా అద్దె చెల్లించి, ఆపై వాటిని అక్రమంగా తక్కువ ధరకు విక్రయించడమేగాక వాహన యజమానులపై బెదిరింపులకు పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.80 లక్షల విలువైన ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ ఠాణాలో గురువారం అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ శశాంక్‌రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ అనుదీప్‌లతో కలిసి ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ నామాలగుండు ఉప్పరిబస్తీకి చెందిన సంగిశెట్టి ప్రవీణ్‌కుమార్ డ్రైవర్‌గా పని చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతను సులువుగా డబ్బులు సంపాదించేందుకు తార్నాకకు చెందిన అమరేందర్, మహ్మద్ రిజ్వాన్‌తో జత కట్టాడు. శ్రీలక్ష్మీ లాజిస్టిక్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. కార్ల యజమానులను సంప్రదించి తమకు వాహనాలు అద్దెకు ఇస్తే సెవెన్ సీటర్‌కు నెలకు రూ.25వేలు, ఫైవ్ సీటర్‌కు రూ. 20 వేలు అద్దె చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారు. రెండు నెలల పాటు సక్రమంగా అద్దె చెల్లించి ఆ తర్వాత మొహం చాటేస్తారు. సదరు వాహనాలను తక్కువ ధరకు విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవారు. నెల అద్దె లేదా వాహనం ఇవ్వాలని అడిగిన యజమానులపై బెదిరింపులకు దిగేవారు. అంబర్‌పేటకు చెందిన జ్ఞానేశ్వర్ తన ఎర్టిగా కారును మూడు నెలల క్రితం వారికి అద్దెకు ఇచ్చాడు. అద్దె డబ్బులు, వాహనం తిరిగి ఇవ్వకపోవడంతో మోసయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు ఇదే తరహాలో పలువురి నుంచి అద్దెకు తీసుకున్న వాహనాలను తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు సంగిశెట్టి ప్రవీణ్‌కుమార్, అమరేందర్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. వారి నుంచి సుమారు రూ.80 లక్షల విలువైన ఏడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు మహ్మద్ రిజ్వాన్ కోసం గాలిస్తున్నారు. కేసును చేధించిన చిలకలగూడ ఎస్‌హెచ్‌ఓ అనుదీప్, ఎస్‌ఐలు రవికుమార్, ఆంజనేయులు, సిబ్బందిని డీసీపీ అభినందించి రివార్డులు అందించారు.
ఇద్దరు నిందితుల రిమాండ్ పరారీలో మరొకరు ఏడు వాహనాలు స్వాధీనం