
45 రోజుల్లో 1061 ఫోన్లు రికవరీ
గచ్చిబౌలి: చోరీకి గురైన, అనుకోకుండా పోగొట్టుకున్న ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారని క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి అన్నారు. 45 రోజుల్లో 1061 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. గురువారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రికవరీ సెల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే సీఈఐఆర్ ఫోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం పోర్టల్‌లో పొందుపరిచి ఫోన్‌ను రికవరీ చేసేందుకు వీలుంటుందన్నారు. వ్యక్తి గత, ఆర్థిక సమాచారం ఫోన్లలోనే ఉంటుందని, ఆలస్యం చేస్తే నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. త్వరగా ఫిర్యాదు చేయకపోతే ఆ ఫోన్‌ను తప్పుడు పనులకు వాడితే మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడకుండా జగ్రత్తగా ఉండాలంటే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు 13,423 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. 45 రోజుల్లో రూ.3.20 కోట్ల విలువైన 1061 ఫోన్లను సీఈఐఆర్ ఫోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు తెలిపారు. మాదాపూర్ సీసీఎస్ 240, బాలానగర్ సీసీఎస్ 188, మెడ్చెల్ సీసీఎస్ 195, రాజేంద్రనగర్ సీసీఎస్ 233, శంషాబాద్ సీసీఎస్ పోలీసులు 205 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో క్రైమ్స్ ఏడీసీపీ రాంకుమార్, సీసీఎస్ ఏసీపీ నాగేశ్వర్ రావు, ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, రవి కుమార్, రాజేష్, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.