
దుబాయి ఎయిర్‌పోర్టులో తెలంగాణ వాసికి అస్వస్థత
ఆసుపత్రిలో చేర్పించిన సిబ్బంది
తన భర్తను ఆదుకోవాలని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో భార్య వినతి
లక్డీకాపూల్: ముంబై నుంచి సౌదీ అరేబియాకు బయలుదేరిన నిజామాబాద్ వాసి ఒకరు దుబాయ్ ఎయిర్‌పోర్టులో అస్వస్థతకు గురయ్యారు. అతన్ని ఆదుకోవాలంటూ భార్య సీఎం ప్రవాసీ ప్రజావాణిలో విన్నవించింది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ పట్టణం మహబూబ్ బాగ్‌కు చెందిన సయ్యద్ బాబా(38) అనే వ్యక్తి గల్ఫ్‌లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3న ముంబై నుంచి సౌదీ అరేబియాలోని అభా నగరానికి వెళుతూ మార్గమధ్యంలో దుబాయ్ ఎయిర్‌పోర్టులో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే స్పందించిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అతన్ని రషీద్ హాస్పిటల్‌లో చేర్పించి మానవత్వం ప్రదర్శించారు.
కాగా అతన్ని ఇండియాకు తిరిగి రప్పించాలని బాబా భార్య సమీనా బేగం సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమానికి సోదరుడు చోటుతో కలిసి వచ్చిన ఆమె ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి బీఎల్ సురేంద్రనాథ్ వారికి మార్గదర్శనం చేశారు. సయ్యద్ బాబా అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకున్నారు. దుబాయిలో ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన నయీమ్, కొట్టాల సత్యం, నారా గౌడ్‌లు రోగి బాగోగులు చూసుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.