
బాలిక సాహసం..ఉడాయించిన దొంగ
సాక్షి, సిటీబ్యూరో: తమ పొరుగింట్లో చోరీకి యత్నించిన దొంగను ఓ బాలిక తరిమికొట్టింది. దొంగతనాన్ని నివారించి అందరి ప్రశంసలు అందుకుంది. వివరాల్లోకి వెళ్తే..చింతల్, భగత్‌సింగ్ నగర్, రోడ్ నంబర్ 12లోని ఓ ఇంట్లో కావలి భవానీ అనే 13 ఏళ్ల బాలిక కుటుంబంతో కలిసి నివసిస్తోంది. తమ కింద పోర్షన్‌లో ఉమా మహేశ్వరి, చంద్రశేఖర్ దంపతులు నివసిస్తుండగా..వారు గురువారం రాత్రి బయటకు వెళ్లడం చూసి ఓ 20 ఏళ్ల యువకుడు దొంగతనం కోసం ఇంట్లోకి ప్రవేశించాడు. కిందింట్లో అలికిడి గమనించిన భవానీ అక్కడికి వెళ్లి ఎవరు నువ్వు అని నిలదీయడంతో యువకుడు బయటకు పరుగెత్తాడు. భవాని అంతటితో వదిలి పెట్టకుండా కేకలు పెడుతూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తూ దుండగుడిని వెంబడించింది. వీధి చివర ప్రణవ్ ఇంటర్నేషనల్ స్కూల్ వరకు తరుముతూ వెళ్లింది. సీసీ కెమెరా రికార్డు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులతోపాటు కాలనీ వాసులు భవానిని ప్రశంసించారు.

బాలిక సాహసం..ఉడాయించిన దొంగ