
‘బ్రిలియంట్’లో రూ.1.07 కోట్ల చోరీ
అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది. ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ.1.07 కోట్లు అపహరణకు గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ విద్యాసంస్థకు చెందిన మూడు కాలేజీల్లో సిబ్బంది నాలుగు రోజులుగా ఫీజు డబ్బులు వసూలు చేశారు. అకౌంటెంట్ సెలవులో ఉండటంతో రూ.1.07 కోట్ల నగదును గురువారం కాలేజీ ఆవరణలోని ఆఫీసు బీరువాలో భద్రపర్చి, ఎప్పటిలాగే తాళాలు వేసి సాయంత్రం 6 గంటలకు ఇళ్లకు వెళ్లారు. శుక్రవారం ఉదయం 8.45 గంటలకు వచ్చిచూడగా మెయిన్ డోర్ ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించారు. ఆఫీసు రూమ్ వద్దకు వెళ్లగా బీరువా తలుపులు తెరిచి ఉండటం, అందులోని డబ్బు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై కళాశాల ఏఓ కేశినేని కుమార్‌తో పాటు పీఎస్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన ప్రాంతంతో పాటు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉండగా చోరీకి పాల్పడిన దుండగులు మెయిన్ డోర్‌ను ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. సీసీ కెమెరాలతో పాటు డీవీఆర్ బాక్స్‌ను సైతం ఎత్తుకెళ్లారు. ఎల్‌బీనగర్ డీసీపీ అనురాధ, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ అశోక్‌రెడ్డి కాలేజీకి చేరుకుని పలువురు సిబ్బందిని విచారించారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాలేజీలో పెద్ద మొత్తంలో డబ్బు చోరీకి గురికావడం చర్చనీయాంశంగా మారింది.
ఫీజు డబ్బులను కాలేజీ ఆఫీసులోభద్రపర్చిన సిబ్బంది
బీరువా తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన దుండగులు

‘బ్రిలియంట్’లో రూ.1.07 కోట్ల చోరీ