
రక్షణ రంగం సాంకేతికతతో పురోగమిస్తున్న భారత్
మణికొండ: రక్షణ రంగంలో మన దేశం సాంకేతికతను విరివిగా వినియోగించి రాణిస్తున్నదని డీఆర్‌డీఓ డైరెక్టర్ జనరల్ (నావల్ సిస్టమ్స్, మెటీరియల్స్) అన్నారు. గండిపేటలోని చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ) కళాశాలలో శుక్రవారం చైతన్య ఆస్ట్రా, సీబీఐటీ ఏరోస్పేస్ క్లబ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే కాస్మోకాన్–2025ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతికతను రక్షణరంగం పూర్తి స్థాయిలో వినియోగిస్తుందన్నారు. డీఆర్‌డీఓ లాంటి సంస్థలలో అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు. భవిష్యత్తు ఇంజనీర్లు మరింత ఉన్నత సాంకేతికతను కనుగొనేందుకు పరిశోధన చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలు, ఆలోచనలు, వృత్తి జీవితానుభవాలను పంచుకున్నారు. విద్యార్థుల ఆసక్తిని పరీక్షించేలా వారికి పలు ప్రశ్నలను సందించి సమాధానాలను రాబట్టారు. అంతకు ముందు డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ వర్చువల్‌గా తన సందేశాన్ని ఇచ్చారు. ప్రిన్సిపాల్ సీవీ నరసింహులు మాట్లాడుతూ... పరిశోధన, నవీనత పట్ల సీబీఐటీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కాస్మోకాన్ కన్వీనర్ ఆకాశ్ కోటి, ఆస్ట్రా అధ్యక్షుడు టి.జై సాయి దిపేష్, ఉపాధ్యక్షుడు హర్షిత్ వర్మ, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ రాహుల్‌లు ఇప్పటి వరకు కొనసాగించిన పరిశోధనలు, సాధించిన విజయాలను వివరించారు.
డీఆర్‌డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్‌వీ హరప్రసాద్