
మిగతా ఐదు చెరువులకూ పునరుజ్జీవం తేవాలి
సాక్షి, సిటీబ్యూరో: బతుకమ్మకుంటను సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకువచ్చిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఇప్పుడు మిగిలిన ఐదు చెరువులపై దృష్టి పెట్టింది. వీటి అభివృద్ధి, పునరుజ్జీవం నవంబర్ నాటికి పూర్తి కావాలంటూ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన శుక్రవారం క్షేత్రస్థాయిలో రెండు చెరువుల వద్ద జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువుల వద్దకు వెళ్లిన ఆయన పలు సూచనలు చేశారు. ఈ రెండు చెరువులు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శిల్పారామం, మెటల్ చార్మినార్ వైపుల నుంచి తమ్మిడికుంటలోకి వచ్చే ఇన్‌లెట్లకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. శిల్పారామం వద్ద వరద నీరు నిలవకుండా వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు చుట్టూ బండ్, బయట వైపు రిటైనింగ్ వాల్ నిర్మించాలని... చెరువు లోపలి వైపు రాతి కట్టడం పటిష్టంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. వేలాది నివాసాల మధ్య ఉన్న కూకట్‌పల్లి నల్లచెరువు వద్ద స్థానికులు సేదతీరేలా అభివృద్ధి చేయాలని రంగనాథ్ సూచించారు. మురుగునీటిని డైవర్ట్ చేసేందుకు నిర్మిస్తున్న కాలువ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జలమండలి అధికారులను కోరారు. గతంలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్ల చెరువు ఆక్రమణలను తొలగించిన తర్వాత 27 ఎకరాలకు పెరిగిందని వివరించారు.
సిబ్బందికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు
తమ్మిడికుంట, నల్లకుంట చెరువు పనుల పరిశీలన