
బాణాసంచా అక్రమ నిల్వలపై టాస్క్‌ఫోర్స్ కన్ను
రూ.18 లక్షల సరుకు స్వాధీనం చేసుకున్న టీమ్
సాక్షి, సిటీబ్యూరో: దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో బాణాసంచా అక్రమ నిల్వలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు కన్నేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నగర వ్యాప్తంగా నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగా ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందానికి రూ.18 లక్షల విలువైన సరుకు చిక్కినట్లు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. బొగ్గులకుంటకు చెందిన శ్యామ్ కుమార్ సుగంధి సిద్ధ అంబర్‌బజార్‌లో ఓ గోదాం నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు, ముందు జాగ్రత్త చర్యలు లేకుండా అందులో భారీగా బాణాసంచా నిల్వ ఉంచారు. జనావాసాల మధ్య ఈ గోదాం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినా అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నగర వ్యాప్తంగా ఉన్న బాణాసంచ అక్రమ నిల్వలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొన్ని రోజులుగా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈస్ట్‌జోన్ బృందానికి శ్యామ్ కుమార్ గోదాంపై సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్ యు.చంద్రశేఖర్ నేతృత్వంలో ఎస్సైలు ఎం.అనంతాచారి, ఎస్.కరుణాకర్‌రెడ్డి, పి.నాగార్జున తమ బృందాలతో దాడి చేసి శ్యామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ.18 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకుని కేసును అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు.