
ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో బీఆర్‌ఎస్ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు
పలువురు బీఆర్‌ఎస్ నాయకుల అరెస్ట్
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: పెంచిన చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్‌ఎస్ చేపట్టిన చలో బస్ భవన్ ఉద్రిక్తంగా మారింది. ఉదయం 8గంటల నుంచే పోలీసులు భారీ ఎత్తున మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. బస్‌భవన్ నలువైపులా బారికేడ్‌లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. అటు వీఎస్‌టీ నుంచి, ఇటు చిక్కడపల్లి, సికింద్రాబాద్, ఇందిరాపార్కు తదితర ప్రాంతాల నుంచి ఆందోళనకారులు బస్‌భవన్ వైపు రాకుండా చర్యలు చేపట్టారు.
దీంతో సాధారణ ప్రజల రాకపోకలకు సైతం ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉదయం 10.30 గంటలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు చేరుకున్నారు. ఆర్టీసీ బస్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసులను, బారికేడ్‌లను దాటుకొని బస్‌భవన్ వైపు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత ఏర్పడింది. నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి.
పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. కేటీఆర్, హరీష్‌రావులతో చిక్కడపల్లి ఏసీపీ రమేష్, గాంధీనగర్ ఏసీపీ యాదగిరిలు మాట్లాడి బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం అందజేసేందుకు లోపలికి పంపించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దేవీ ప్రసాద్ పాల్గొన్నారు.

బస్‌భవన్‌కు వస్తున్న కేటీఆర్, హరీష్‌రావు, పద్మారావు తదితరులు