ఆర్టీసీ సిబ్బంది మెడపై..‘ఈవీ’ కత్తి! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సిబ్బంది మెడపై..‘ఈవీ’ కత్తి!

Oct 10 2025 12:08 PM | Updated on Oct 10 2025 12:08 PM

ఆర్టీసీ సిబ్బంది మెడపై..‘ఈవీ’ కత్తి!

ఆర్టీసీ సిబ్బంది మెడపై..‘ఈవీ’ కత్తి!

గ్రేటర్‌ పరిధిలో త్వరలో రోడ్డెక్కనున్న 275 అద్దె బస్సులు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో దశలవారీగా రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్‌ బస్సులు ఆర్టీసీ సిబ్బంది మనుగడకు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. కాలుష్యరహిత, పర్యావరణహితమైన, ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని అందజేసే ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఈవీ)లు వేలాదిమంది సిబ్బంది మెడపై కత్తిగా వేలాడనున్నాయి. ప్రస్తుతం 265 ఎలక్ట్రిక్‌ బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. త్వరలో మరో 275 వరకు రోడ్డెక్కనున్నాయి. వచ్చే రెండేళ్లలో 2,800 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ బస్సుల కోసం కొత్తగా పది డిపోలను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉంది. మరోవైపు రెండేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ బస్సుల చార్జింగ్‌ పేరిట ఆర్టీసీ ఇప్పటికే ప్రయాణికులపై చార్జీల భారాన్ని మోపింది. ఈ క్రమంలోనే దశలవారీగా సిబ్బందికి సైతం ఉద్వాసన పలికే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ– బస్సులతో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 25 డిపోల్లో వివిధ స్థాయిల్లో పని చేసే సుమారు 15,000 మందికి పైగా ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్‌ బస్సు ల పేరిట జరిగే ప్రైవేటీకరణ చర్యలను వ్యతిరేకించేందుకు కార్మిక సంఘాలు ఆందోళనకు సన్నద్ధమవుతున్నాయి.

ఒక బస్సుతో ఐదుగురికి నష్టం..

ప్రధానమంత్రి ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ (పీఎం ఈ– డ్రైవ్‌) పథకంలో భాగంగా ఎలక్ట్రిక్‌ అద్దె బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేట్‌ సంస్థలకు చెందిన డ్రైవర్లే ఈ బస్సులను నడుపుతారు. దీంతో ఆర్టీసీకి ప్రత్యేకంగా డ్రైవర్ల అవసరం ఉండదు. మెకానిక్‌లు, టెక్నీషియన్‌లు తదితర సిబ్బంది అవసరం కూడా ఉండదు. కండక్టర్ల అవసరం మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం ఒక బస్సుకు ఐదుగురు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఒక డ్రైవర్‌, ఒక కండక్టర్‌తో పాటు మెకానిక్‌, టెక్నీషియన్‌, సూపర్‌వైజర్లు ఉన్నారు. ఈ లెక్కన నగరంలోని అన్ని డిపోల్లో 15,000 మంది పని చేస్తున్నారు. వీరిలో సుమారు 6,000 మంది డ్రైవర్లే. ఎలక్ట్రిక్‌ బస్సుల వల్ల పెద్ద సంఖ్యలో నష్టపోయేది కూడా డ్రైవర్లే కావడం గమనార్హం. ఆ తరువాత మెకానిక్‌లు, టెక్నీషియన్‌ల ఉద్యోగాలకు కూడా ప్రమాదం పొంచి ఉండనుంది.

● ఈ క్రమంలో హైదరాబాద్‌లో పని చేసే సిబ్బందిని జిల్లాల్లో సర్దుబాటు చేయడంతో పాటు, ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉన్న వారిని స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం ఒత్తిడి చేసేలా ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ డిపోలు కూడా ప్రైవేట్‌ బస్సుల నిర్వహణకు పరిమితం కానున్నాయి. ప్రస్తుతం హెచ్‌సీయూ డిపోను పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం వినియోగిస్తున్నారు. కంటోన్మెంట్‌, రాణిగంజ్‌, కూకట్‌పల్లి, హయత్‌నగర్‌ తదితర డిపోల్లో చార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. త్వరలో అన్ని డిపోల్లోనూ హైటెన్షన్‌ విద్యుత్‌ సదుపాయం కలిగిన చార్జింగ్‌ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఈ డిపోలన్నీ ఎలక్ట్రిక్‌ బస్సుల చార్జింగ్‌, పార్కింగ్‌ అవసరాలకు వినియోగిస్తారు. అప్పుడు వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బంది అవసరం ఉండదు.

కేంద్రం సబ్సిడీ ప్రైవేటుకేనా?

● ప్రజారవాణా రంగంలో ఈవీలను ప్రోత్సహించేందుకు ఈవీ బస్సులపై కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. పీఎం –ఈ డ్రైవ్‌లో భాగంగా ఒక్కో బస్సుపై సుమారు రూ.35 లక్షల వరకు రాయితీ లభిస్తుంది. రూ.కోటికిపైగా ఖరీదైన ఈ– బస్సులను కొనుగోలు చేసే ప్రైవేట్‌ సంస్థలకే రాయితీ లభిస్తుందని, దీనివల్ల ఆర్టీసీకి పెద్దగా ప్రయోజనం ఉండబోదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

● ఎలక్ట్రిక్‌ బస్సులకు ఆర్టీసీయే చార్జింగ్‌, పార్కింగ్‌ సదుపాయాన్ని అందజేస్తోంది. ప్రయాణికుల నుంచి చార్జీల రూపంలో వచ్చే ఆదాయంలో మాత్రం కిలోమీటర్‌కు సుమారు రూ.57 చొప్పున ప్రైవేట్‌ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఏ విధంగానూ ఆర్టీసీకి లాభదాయకం కాదని, అద్దె ప్రాతిపదికన నడపడం కంటే సొంతంగా ఈవీలను సమకూర్చుకోవడం వల్ల ఆదాయం పెరుగుతుందని ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వెంకన్న తెలిపారు. మరోవైపు ప్రస్తుతం నగరంలో సుమారు 22 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు.వీరిలో 16 లక్షల మంది వరకు మహిళలే ఉన్నారు. వారి ఉచిత ప్రయాణాలపై ప్రభుత్వం చెల్లించే రీయింబర్స్‌మెంటే ఆర్టీసీకి ప్రధాన ఆదాయం. నగదు రూపంలో లభించేది తక్కువే. ఉచిత ప్రయాణాలపై ప్రభుత్వ చెల్లింపులు నిలిచిపోయినా, ఆలస్యమైనా ఆర్టీసీ దారుణంగా నష్టపోతుంది.

ప్రభుత్వ కుట్రలను సహించబోం..

ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీని నమ్ముకొని బతుకుతున్న కార్మికులను బయటకు పంపించేందుకు ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది. ఈ పరిణామాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం. కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని ప్రజా క్షేత్రంలో దోషిగా నిలబెడతాం.

– ఈదరి వెంకన్న, ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌

రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్‌ బస్సులకు ప్రణాళికలు

ప్రశ్నార్థకంగా 15,000 మంది ఉద్యోగుల భవిష్యత్‌

దశలవారీగా ఆర్టీసీ సొంత బస్సులకు ఉద్వాసన

ఎలక్ట్రిక్‌ వాహనాల కోసమే ఏర్పడనున్న కొత్త డిపోలు

ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement