
జూబ్లీహిల్స్‌లో ‘హస్త’ కష్టాలు
కాంగ్రెస్ కేడర్ మధ్య కొరవడిన సఖ్యత
ఎవరికి వారే.. యమునా తీరే చందం
అమాత్యుల ముందే అమీతుమీకి సిద్ధం
ఖరారైన అభ్యర్థిత్వం.. ఏకతాటిపైకి వచ్చేనా?
సాక్షి, సిటీబ్యూరో: అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. యువనేత నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కానీ.. పార్టీ కొత్త, పాత శ్రేణుల్లో ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు పార్టీకి పెను సవాల్‌గా మారాయి. ఈ పరిస్థితితో పార్టీ నేతలతో పాటు కేడర్ స్థాయిలోనూ గందరగోళం నెలకొంది. రెండు నెలలుగా మంత్రులు రంగంలోకి దిగి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేరిట సుడిగాలి పర్యటనలు చేసినప్పటికీ.. పాత, కొత్త కేడర్‌ను ఏకతాటిపై తేచ్చేందుకు ప్రయత్నించకపోవడంతో విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కుతారోనని రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
ఎడమొహం.. పెడమొహమే..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమై.. రాజకీయ వాతావరణం వేడేక్కి మూడు, నాలుగు మాసాలు కావస్తునప్పటికీ.. కాంగ్రెస్‌లోని కొత్త, పాత కేడర్‌లో సఖ్యత లేకుండా పోయింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఉప ఎన్నిక కావడంతో చాలెంజ్‌గా తీసుకొని ముందస్తుగానే గెలుపు మార్గాలను సుగమం చేసుకునేందుకు క్షేత్ర స్థాయిలో ముగ్గురు మంత్రులు, 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లను రంగంలోకి దింపింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొత్త, పాత క్యాడర్ మధ్య ఆధిపత్య పోరు కోసం అమాత్యుల ముందే అమీతుమీలకు దిగడం వంటి ఘటనలు కొనసాగాయి. ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి కనబర్చిన ఆశావహులు సైతం మంత్రుల పర్యటన కార్యక్రమాలకు పరిమితమై కనీసం పలకరింపు కూడా లేకుండా ఎవరికి వారే యమునా తీరే విధంగా వ్యవహారించడం విస్మయానికి గురిచేసింది. అభ్యర్థిత్వం ఖరారు అనంతరం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది.
ఆశావహుల్లో అసంతృప్తి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి కనబర్చిన ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. వీరిలో కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన నేతలతో పాటు దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తున్న నేతలు కూడా ఉన్నారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి , విద్యావేత్త భవానీ శంకర్ తదితరుల టికెట్ ఆశించి విఫలమయ్యారు. వీరి అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా తయారైందన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.