
అదుపులో నైజీరియాకు చెందిన ఓనురా సోలమన్ చిబుజ్
నగరం కేంద్రంగా నైజీరియన్ వ్యవహారం
డిపోర్టేషన్ చేసిన హెచ్–న్యూ అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: వైద్యం కోసమంటూ మెడికల్ వీసాపై వచ్చిన ఓ నైజీరియన్ గంజాయి దందా ప్రారంభించాడు. వీసా గడువు ముగిసినా, పాస్‌పోర్టు ఎక్స్‌పైర్ అయినా ఇక్కడే తిష్ట వేశాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఎలాంటి మాదకద్రవ్యం లభించకపోవడంతో డిపోర్టేషన్ విధానంలో బలవంతంగా తిప్పి పంపినట్లు డీసీపీ వైవీఎస్ సుధీంద్ర గురువారం వెల్లడించారు.
నైజీరియాకు చెందిన ఓనురా సోలమన్ చిబుజ్ కొన్నాళ్లు తన స్వస్థలంలో చిరు వ్యాపారిగా బతికాడు. 2014 ఆగస్టు 14న మెడికల్ వీసాపై ఢిల్లీ వచ్చాడు. ఆ ఏడాది సెప్టెంబర్ 23 వరకే వీసా గడువు ఉంది. పాస్‌పోర్టు సైతం 2016 జనవరి 16న ఎక్స్‌పైర్ అయిపోయింది. అయినప్పటికీ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో మూడేళ్ల పాటు పని చేశాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్ వచ్చి అత్తాపూర్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. పుణె, ముంబైల్లో ఉన్న డ్రగ్ పెడ్లర్స్ నుంచి తక్కువ ధరకు గంజాయి ఖరీదు చేసుకుని వచ్చేవాడు. ఆ సరుకును నగరంలో ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు.
ఇటీవల టోలిచౌకి ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న సోలమన్‌ను హెచ్–న్యూ అదుపులోకి తీసుకుంది. ఇన్‌స్పెక్టర్ జీఎస్ డానియేల్, ఎస్సై సి.వెంకట రాములు నేతృత్వంలోని బృందం విచారించింది. వీసా, పాస్‌పోర్టు లేవని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. దీంతో ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) సహకారంతో డిపోర్టేషన్ చేసింది.