
అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులో కొండ చిలువ
నిజాంపేట్: బాచుపల్లిలోని రెడ్డీస్ ల్యాబ్ సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తులో భారీ కొండ చిలువు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఈ నెల 8న రెండో అంతస్తులోని ఓ గదిలో కొండ చిలువును గుర్తించిన అపార్ట్‌మెంట్ వాసులు స్నేక్ టీమ్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి కొండ చిలువను బంధించారు. అనంతరం దానిని సమీపంలోని అడవిలో వదిలేశారు.
నిందితుడిపై కేసు నమోదు
సైదాబాద్: మద్యం మత్తులో ఓ యువకుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...ఐఎస్‌సదన్ డివిజన్ పరిధిలో ఓ బాలిక కుటుంబంతో సహా నివాసం ఉంటోంది. వారి ఇంటి సమీపంలో ఓ యువకుడు (24) ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా బాలిక తన సోదరుడితో కలిసి ఇంట్లో ఉంది. అదే అదనుగా భావించిన సదరు యువకుడు ఆమెను తన గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్: పరిమితికి మించి బంగారం, వెండి ఆభరణాలతో పట్టుబడిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన బిన్సన్ డేవిస్ అనే ప్రయాణికుడి కదలికలను గమనించిన సీఐఎస్‌ఎఫ్ అధికారులు చేతి సంచి క్షుణ్ణంగా పరిశీలించడంతో అందులో 2.80 కేజీల బంగారు ఆభరణాలు, 3 కేజీల వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి భువనేశ్వర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు గుర్తించారు. సీఐఎస్‌ఎఫ్ అధికారులు ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఐటీ అధికారులు ఎయిర్‌పోర్టుకు చేరుకుని వారిని విచారిస్తున్నారు.
కుత్బుల్లాపూర్: ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తూర్పు గోదావరి జిల్లా, చింతపల్లికి చెందిన వినయ్‌దుర్గ (19) మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ చదువుతూ వర్సిటీ హాస్టల్‌లోనే ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం హాస్టల్ వార్డెన్ రాజేంద్ర గదులను తనిఖీ చేస్తుండగా 010 గది లోపల నుంచి గడియపెట్టినట్లు గుర్తించాడు. దీంతో గది తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో వెంటిలేటర్ నుంచి చూడగా వినయ్ దుర్గ టవల్‌తో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో తలుపులు బద్దల కొట్టి వినయ్‌దుర్గను సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.