
ఆత్మస్థైర్యంతో కేన్సర్‌ను జయించొచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: ఆత్మ స్థైర్యంతో కేన్సర్‌ను జయించొచ్చునని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అపోలో కేన్సర్ సెంటర్ ఆసుపత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజీ, డైరెక్టర్ డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి కేన్సర్‌పై రాసిన ‘ఐ యామ్ సర్వైవర్’(నేను కేన్సర్‌ను జయించాను) అనే పేరుతో పుస్తకాన్ని రచించారు. హిందీ అనువాద ‘మైనే కేన్సర్ కో జీతా హూ’ పుస్తకావిష్కరణ సభ బుధవారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో జరిగింది. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్(ఢిల్లీ) శివకుమార్ పట్టాభిరామన్, విజయ్ ఆనంద్ రెడ్డిలతో కలసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య వృత్తిలో 30 ఏళ్ల అనుభవాన్ని ఈ పుస్తక రూపంలో ప్రజలకు తెలపడం అభినందనీయమన్నారు. కేన్సర్ పేరు చెబితే భయపడే పరిస్థితుల నుంచి, వ్యాధిని ఎలా జయించొచ్చు అనే విషయాలను పుస్తకంలో స్పష్టంగా వివరించడం మంచి పరిణామన్నారు. ఆత్మ స్థైర్యంతో కేన్సర్‌ను జయించొచ్చు అనే నిజాన్ని ఈ పుస్తకం ద్వారా ప్రజలకు తెలిపినందుకు అభినందనలు అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేన్సర్ మహమ్మారిపై దండయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కేన్సర్ సెంటర్‌లను ఏర్పాటు చేసి, రోగులకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ పుస్తకం ద్వారా ప్రతి రోగి ఆత్మవిశ్వాసంతో ముందుకెళతారని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి అన్నారు. ఈ పుస్తకంలో కేన్సర్‌ను జయించిన 108 మంది విజయగాథలను, వారి అనుభవాలను పొందుపరిచినట్లు పుస్తక రచయిత డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి తెలిపారు. రోగుల జీవితంపై ప్రేమను ప్రతిబింబించాలనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకాన్ని రాసినట్లు పేర్కొన్నారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో ‘ఐ యామ్ సర్వైవర్’ పుస్తకావిష్కరణ