
సంస్కృతి,సంప్రదాయాలను పరిరక్షించాలి
బన్సీలాల్‌పేట్: భారత దేశ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అసలైన దేశ చరిత్రను నేటి తరం తెలుసుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సికింద్రాబాద్ పద్మారావునగర్ సుప్రసిద్ధమైన స్కందగిరి దేవాలయంలో జరుగుతున్న శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవ వేడుకలకు గురువారం రాత్రి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో గొప్పవని ఆవి మన వేద విజ్ఞానంతో ముడిపడి ఉన్నాయన్నారు. సనాతన ధర్మం వేదంతో ముడిపడి ఉందన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు దశాబ్ధాలుగా ఎన్నో ఆటుపోట్లకు తట్టుకొని నిలబడిందని దానికి వేదమే ప్రమాణికమన్నారు. ఇతర దేశస్తులు మన సంపదను దోచుకొని పొయారు గాని మన జీవన ప్రమాణానికి ఆధారమైన వేదజ్ఞానాన్ని మన నుంచి విడదీయలేకపొయారన్నారు. వేద పాఠశాలతో పాటు ఆధునిక విజ్ఞానాన్ని అందిస్తున్న శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్‌ను అభినందిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. వేదాలు, శాస్త్రాలను గౌరవిస్తూ విద్యార్ధులు తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షతన వహించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను వివరించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ట్రస్ట్ రజతోత్సవాల సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో చైర్మెన్ తూములూరి శాయినాథ్ శర్మ, ప్రధాన కార్యదర్శులు పసుమర్తి బ్రహ్మానంద శర్మ, చింతపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ