
స్థిరమైన, సమగ్ర పర్యాటకాభివృద్ధే లక్ష్యం
రాయదుర్గం: రాష్ట్రంలో స్థిరమైన, సమగ్ర పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి క్రాంతి అన్నారు. ‘టూరిస్ట్ పోలీస్ ఓరియంటేషన్ అండ్ సెన్సిటైజేషన్’ అంశంపై వారం రోజుల పాటు గచ్చిబౌలిలోని ‘నిథమ్’ క్యాంపస్‌లో టూరిజమ్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని కీలక పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులకు పూర్తి స్థాయి భద్రత కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. అందులో భాగంగా టూరిజమ్ పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిథమ్ ప్రిన్సిపల్ ఎంకెగణేష్, నిథమ్ ఫ్యాకల్టీడాక్టర్ నీరజ్‌గోయల్, మిషెల్లీ జే ఫ్రాన్సిస్, యాదగిరి, ఇతర అధికారులు, టీఎస్‌టీడీసీ అధికారులు, శిక్షణ పొందిన టూరిజమ్ పోలీసులు పాల్గొన్నారు.