
ఎన్నికల ప్రవర్తన నియమావళి.. ‘జూబ్లీహిల్స్’ వరకే
షేక్‌పేట తహసీల్దార్ ఆఫీస్‌లో ఆర్‌ఓ కార్యాలయం
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను తప్పక పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సూచించారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ప్రవర్తన నియమావళి)పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రవర్తన నియమావళికి లోబడే ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నారు. నియమావళి ఉల్లంఘిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రాపర్టీలపై ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఏర్పాటు చేయవద్దన్నారు. ప్రైవేట్ ప్రాపర్టీ లపై ప్రచార ప్రకటనలు పెడితే అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే తొలగించిన ప్రదేశాలలో అనుమతి లేకుండా మళ్లీ ప్రచార ప్రకటనలు పెడితే బాధ్యులపై కేసులతో పాటు వాటిని తొలగించేందుకయ్యే ఖర్చును కూడా బాధ్యుల పార్టీ ఖాతాల్లో వేస్తామని తెలిపారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ..
ఎన్నిక జరిగే అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని లేదా మెట్రోపాలిటన్ నగరాలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లలో ఉంటే ఎన్నికల ప్రవర్తన నియామవళి కేవలం ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే వర్తిస్తుందన్న నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం వెలువరించిందన్నారు. ఈ నిబంధనల ప్రకారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజధానితో పాటు మెట్రోపాలిటన్ నగరంలో ఉన్నందున కేవలం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. షేక్‌పేట తహసీల్దార్ ఆఫీస్‌లో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేసినట్లు కర్ణన్ తెలిపారు. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట భద్రత చర్యలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఉప ఎన్నికలో ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, ఎన్నికల అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీసీపీ అపూర్వ రావు, రిటర్నింగ్ అధికారి పి.సాయిరాం, రాజకీయ పార్టీల తరఫున కె.నందేశ్ కుమార్ (బీఎస్పీ), కొల్లూరు పవన్ కుమార్, ఎల్.దీపక్ (బీజేపీ), విజయ్ మల్లంగి (ఆప్), ఎం. శ్రీనివాసరావు (సీపీఐఎం), పి.రాజేశ్ కుమార్, మహ్మద్ వాజీద్ హుస్సేన్, ఎ.రాఘవేందర్ (కాంగ్రెస్), ఎ. శ్రీనివాస్ గుప్తా, కె. మాధవ్, కిషోర్ గౌడ్ (బీఆర్‌ఎస్), ప్రశాంత్ రాజ్ యాదవ్ (టీడీపీ), సయ్యద్ ఖలీలుద్దీన్ (ఎంఐఎం) పాల్గొన్నారు.
13 నుంచి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు
ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు
జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
ప్రచార ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో రాజకీయ ప్రచార ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ,జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని సీపీఆర్వో విభాగంలో ఎంసీఎంసీ, మీడియా కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.