
ఆగాలి కాలుష్యం
నగరంలో ప్రమాదకర స్థాయిలో వాయు నాణ్యత
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థితికి చేరింది. ఫలితంగా కన్ను, ఊపిరితిత్తుల వ్యాధులు ప్రబలుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఎన్నిరకాల కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ గాలి నాణ్యతను పెంచడంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), ప్రభుత్వ అధికార యంత్రాంగం విఫలమవుతోంది. నగర దారులపై పాదచారులు, మోటారు సైకిల్, బస్సుల్లో ప్రయాణించే వారికి నరకప్రాయంగా మారుతోంది. కాలుష్య నియంత్రణ మండలి నివేదికలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.
నిర్మాణ, పారిశ్రామిక ప్రాంతాల్లో అవస్థలు
ఇటీవల కురుస్తున్న వర్షాలతో నగరంలోని రహదారులు ఇసుక, మట్టిదిబ్బలతో దర్శనమిస్తున్నాయి. ఉదయం సమయంలో కాస్త ఎండ కాయడంతో తడారిపోయి వాహనాలు వెళ్లినపుడు ఇసుక, మట్టి, ధూళి కణాలు సాధారణ ప్రయాణికుల కళ్లలో పడుతున్నాయి. ఎల్‌బీనగర్, కోకాపేట్, ఉప్పల్, మాదాపూర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో నిర్మాణ రంగం జోరుగా ఉన్న ప్రాంతాల్లో ఇది మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. పటాన్‌చెరు, పాశమైలారం, బొల్లారం వంటి పారిశ్రామిక వాడల్లోనూ వాయు కాలుష్యం గరిష్ట స్థాయిలను సూచిస్తోంది. సాధారణంగా పీఎం10 ధూళి కణాలు 0 నుంచి 50 ఉండాల్సి ఉండగా, నగరంలోని కోకాపేట్ ప్రాంతంలో బుధవారం 232గా నమోదయ్యింది. పీఎం2.5 సోమాజిగూడలో 200గా ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. నిర్మాణ రంగం వృద్ధిలో ఉన్న ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటోంది. పెద్ద సంఖ్యలో లారీలు మట్టి, ఇసుక, గ్రావెల్, సిమెంట్, ఇతరాలు తరలించే క్రమంలో కనీస నిబంధనలు పాటించడంలేదు. దీనిపై అటు జీహెచ్‌ఎంసీ, ఇటు కాలుష్య నియంత్రణ మండలి ఎవరూ పట్టించుకోవడం లేదు.
చర్యలు అంతంతే..
వాయు కాలుష్యానికి కారణమవుతున్న వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకోవడంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఉదారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో అడపదడప తనిఖీలు చేపట్టడం, నోటీసులిస్తున్నారు. అరుదైన సందర్భాల్లో మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అనంతరం కొన్నాళ్లకు తిరిగి అదే పరిశ్రమ రీఓపెన్‌కు ఎన్‌ఓసీ జారీ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అధికారుల తీరు పై బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.
పనిచేయని పరికరాలు..
వాయు నాణ్యత కొలతల కోసం కాలుష్య నియంత్ర ణ మండలి ఏర్పాటు చేసిన పరికరాలు కొన్ని చోట్ల పనిచేయడం లేదు. బుధవారం నాచారం, ఐఐటీహెచ్ కంది ప్రాంతాల్లో గాలి నాణ్యత నివేదికలే అందుబాటులో లేవు. నగరం నడిబొడ్డున ఉన్న సన త్‌నగర్‌లో పీఎం 10 వివరాలు నమోదు చేయలేదు.
శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు..
గాలిలో దూళికణాల సంఖ్య పెరిగినపుడు సీఓపీడీ, క్రానిక్ బ్రాంకై టిస్, ఆస్తమా జబ్బుల ప్రభావం పెరుగుతుంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్న వారికి ఎక్కువ ఇబ్బంది. చల్లని కాలం, ఆపై గాలిలో నాణ్యత తగ్గితే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి సైతం ఈ గాలి ప్రమాదమే. తొలుత జలుబు చేసి, అది న్యుమోనియాగా మారొచ్చు. ధూళి కణాలు కళ్లలో పడినా ఇబ్బందికరమే. మోటారు సైకిల్‌పై వెళ్లే సమయంలో కళ్లజోడు ధరించడం మంచిది.
– ప్రొ.టి. ప్రమోద్ కుమార్, పల్మనాలజిస్టు
ఇటీవల వర్షాలతో రోడ్లపై పేరుకుపోయిన ఇసుక, మట్టి
కళ్లల్లోకి దుమ్ము, ఇసుక రేణువులు
శ్వాసకోశ వ్యాధులు వస్తాయంటున్న వైద్యులు
వాహనదారులు, బస్సు ప్రయాణికులకు ఇబ్బందులు