‘పోస్ట్‌’ చేసే ముందు ఒక్క క్షణం! | - | Sakshi
Sakshi News home page

‘పోస్ట్‌’ చేసే ముందు ఒక్క క్షణం!

Oct 9 2025 8:05 AM | Updated on Oct 9 2025 8:05 AM

‘పోస్ట్‌’ చేసే ముందు ఒక్క క్షణం!

‘పోస్ట్‌’ చేసే ముందు ఒక్క క్షణం!

మనోభావాలను దెబ్బతీయొద్దని హితవు

తప్పుడు సమాచార ప్రచారం వద్దని హెచ్చరిక

డిజిటల్‌ అవేర్‌నెస్‌ చేపడుతున్న కొత్త కొత్వాల్‌

సాక్షి, సిటీబ్యూరో: కొత్త కొత్వాల్‌ విశ్వనాథ్‌ చన్నప్ప సజ్జనర్‌ తన ‘ఎక్స్‌’ ఖాతా వేదికగా డిజిటల్‌ అవేర్‌నెస్‌కు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి హ్యాష్‌ట్యాగ్‌ పాస్‌ బిషోర్‌ పోస్టు (పోస్టు చేసే ముందు ఒక్కక్షణం) అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన బుధవారం కీలక సందేశాన్ని పోస్టు చేశారు. సోషల్‌మీడియా ప్రతి ఒక్కరినీ శక్తిమంతుల్ని చేసిందని, సమాచారాన్ని పంచుకోవడానికి, ఎదుటి వారిని ప్రేరేపించడానికి, ప్రభావితం చేయడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదైనా ఓ విషయాన్ని లేదా సమాచారాన్ని సెండ్‌ (పంపడం)... షేర్‌ చేయడానికి ముందు ఒక్క క్షణం ఆగి మూడు విషయాలను ఆలోచించాలని సజ్జనర్‌ స్పష్టం చేశారు. ఈ పోస్టు ఎవరినైనా బాధ పెడుతుందా..? ఇందులోని సమాచారం నిజమైనదేనా? సోషల్‌మీడియాలో ఓ వ్యక్తిని ఉద్దేశించి పెట్టే సమాచారం ఆయన ఎదురుగానూ వ్యాఖ్యానించగలవా? అనేవి సరి చూసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించారు. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా షేర్‌ చేసిన కొన్ని అంశాలు ఎదుటి వారి కీర్తి ప్రతిష్టలు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయనే విషయం మరిచిపోవద్దని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ డిజిటల్‌ రెస్పాన్స్‌బుల్‌గా ఉండాలని, ఏదైనా షేర్‌ చేసేముందు కచ్చితంగా ఆలోచించాలని సజ్జనర్‌ స్పష్టం చేశారు.

వారంలో 85 లక్షల వ్యూస్‌..

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సజ్జనర్‌ తన ఖాతాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. యువతకు సైతం దగ్గర కావాలనే ఉద్దేశంతో ‘ఎక్స్‌’తో పాటు ఇన్‌స్ట్రాగాంలోనూ తనదైన పాత్రను పోషిస్తున్నారు. గతంలో హ్యాష్‌ట్యాగ్‌ సే నో టు బెట్టింగ్‌ యాప్స్‌ పేరుతో ఓ ఉద్యమాన్నే నడిపి ప్రత్యేక చట్టం కావడానికి తన వంతు కృషి చేశారు. యువతను ఈయన సొంత ఇన్‌స్ట్రాగాం ఖాతాను గడిచిన వారం రోజుల్లో 85 లక్షల మంది వీక్షించారు. నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న ఫొటోకు ఇన్‌స్ట్రాగాంలో 12 లక్షలు, ‘ఎక్స్‌’లో 2 లక్షల వ్యూస్‌ వచ్చాయి. సజ్జనర్‌ ‘ఎక్స్‌’ ఖాతాకు వారం రోజుల్లో 15 లక్షల మంది రియాక్ట్‌ అయ్యారు. సోషల్‌మీడియా ద్వారా తన దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని నగర పోలీసు అధికారిక హ్యాండిల్స్‌కు ట్యాగ్‌ చేస్తున్న ఆయన ఆద్యంతం పర్యవేక్షిస్తున్నారు. చార్మినార్‌ వద్ద ఓ విదేశీ మహిళను వేధించిన వీడియో ఇటీవల వైరల్‌గా మారింది. దీన్ని క్షేత్రస్థాయి అధికారులకు పంపిన సజ్జనర్‌ పూర్తి స్థాయి విచారణ చేయించి మూడేళ్ల క్రితం నాటిదిగా నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement