
తుపాకీ విక్రయానికి పండ్ల వ్యాపారుల యత్నం
పట్టుకున్న సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్
సాక్షి, సిటీబ్యూరో: ఝార్ఖండ్ నుంచి వలస వచ్చి నగరంలో పండ్ల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి తేలిగ్గా డబ్బు సంపాదించడానికి తుపాకీ విక్రయానికి యత్నించాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సీసీఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్ అతడితో పాటు మరొకరిని పట్టుకున్నట్లు అదనపు సీపీ (నేరాలు) ఎం.శ్రీనివాసులు బుధవారం వెల్లడించారు. ఝార్ఖండ్‌కు చెందిన విజయ్ యాదవ్ నగరానికి వలసవచ్చి లింగంపల్లిలో నివసిస్తున్నాడు. వివిధ బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపుల వద్ద పండ్లు విక్రయిస్తూ జీవస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు నాటు తుపాకుల్ని తీసుకువచ్చి విక్రయించాలని భావించాడు. మూడు నెలల క్రితం బీహార్ వెళ్లి అక్కడి సోను కుమార్ నుంచి రూ.58 వేలకు 0.7 ఎంఎం క్యాలిబర్ నాటు పిస్టల్ ఖరీదు చేసుకువచ్చాడు. దీన్ని నగరంలోని అసాంఘిక శక్తులకు అమ్మడానికి సహకరించాల్సిందిగా సంతోష్‌నగర్‌లో ఉంటున్న తోటి పండ్ల వ్యాపారి బుంటి కుమార్ యాదవ్‌ను కోరారు. కొన్ని రోజులుగా ఇతగాడు ఆ అక్రమ ఆయుధం అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏసీపీ జి.వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బి.బిక్షపతి నేతృత్వంలోని బృందం ఫలక్‌నుమా ప్రాంతంలో వలపన్ని బుంటి కుమార్‌ను పట్టుకుంది. విజయ్‌ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి తుపాకీ, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించింది.