
గ్లెండేల్ అకాడమీ విద్యార్థులకు సీఎం అభినందన
బండ్లగూడ: సింగపూర్‌లో ఇటీవల జరిగిన గ్లోబల్ ఎక్సలెన్స్ డే(జీఈడీ) 2025లో మిడిల్ స్కూల్ విభాగంలో సన్‌సిటీలోని గ్లెండేల్ అకాడమీ విద్యార్థులు బంగారు పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థులను అభినందించి సన్మానించారు. గ్రీన్ గ్లెన్ గార్డియన్స్ బృందంలో ఆరాధ్య దుద్దిళ్ల శ్రీపాదరావు(6వ తరగతి), నిగమా పెన్మెట్సా(6వ తరగతి), సయ్యద్ అలిజా జైఆమా(6వ తరగతి), రాహిని సమ్హిత వర్మ దంతులూరి(7వ తరగతి), జేడెన్ డి రోజారియో(7వ తరగతి) ఉన్నారు. ఈ బృందం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 11 పాఠశాలల నుంచి 200 మందికి పైగా విద్యార్థులతో పోటీపడ్డారు. ది గుడ్ ఫుడ్ మూవ్‌మెంట్ అనే తమ ప్రాజెక్టును కై జెన్ (నిరంతర అభివృద్ధి) అనే అంశం కింద ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వారు సేంద్రియ వ్యవసాయం, స్ధిరమైన వ్యవసాయ విధానాల ప్రాముఖ్యతను వివరించారు. రసాయనాలపై ఆధారపడిన వ్యవసాయం వల్ల కలిగి హానికర ప్రభావాలు, పర్యావరణపరమైన బాధ్యతాయుత పద్ధతుల అవసరం, పర్యావరణ అవగాహన పెంపు కోసం ప్రాక్టికల్ లెర్నింగ్ ప్రాముఖ్యత తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... తమ ఆవిష్కరణాత్మక ఆలోచనలతో స్థిరమైన అభివృద్ధి పట్ల కట్టుబాటుతో తెలంగాణను ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఈ విద్యార్థులు రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ మిను సలూజా తదితరులు పాల్గొన్నారు.