
మహా అడుగులు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పునర్‌వ్యవస్థీకరణకు రంగం సిద్థమైంది. హెచ్‌ఎండీఏ పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగిన దృష్ట్యా అందుకనుగుణంగా కార్యకలాపాల నిర్వహణ కోసం జోనల్ వ్యవస్థను విస్తరించనున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగర అవసరాలను దృష్టిలో ఉంచుకొని హెచ్‌ఎండీఏ సేవలను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో సంస్థాగతమైన పునర్‌వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టారు. ఈమేరకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను అందజేసేందుకు కన్సల్టెన్సీ నియామకం కోసం ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్‌లను ఆహ్వానించారు. హెచ్‌ఎండీఏ పరిధిని 7,257 చ.కి.మీ. నుంచి 10,526 చ.కి.మీ. వరకు విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 11 జిల్లాలు, 104 మండలాలు, 1,359 గ్రామాలు హెచ్‌ఎండీఏలో విలీనమయ్యాయి. ఈ మేరకు ప్రణాళికాబద్ధమైన మహానగరం నిర్మాణం, అభివృద్ధి దృష్ట్యా కార్యకలాపాలను వికేంద్రీకరించనున్నారు. ప్రస్తుతం ఘట్కేసర్, శంషాబాద్, శంకర్‌పల్లి–1, శంకర్‌పల్లి–2, మేడ్చల్–1, మేడ్చల్–2 జోన్‌ల పరిధిలో హెచ్‌ఎండీఏ ప్రణాళికా విభాగం సేవలను అందజేస్తోంది. కొత్తగా పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకొని మరో నాలుగు జోన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి పరిధిలోకి వచ్చే ప్రాంతాలను కూడా పునర్‌వ్యవస్థీకరించనున్నారు. ఇందుకనుగుణంగా అధ్యయనం చేసి నివేదికను అందజేసేందుకు కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు.
లక్ష్యాలు ఇలా..
● అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హెచ్‌ఎండీఏను సంస్థాగతంగా పునర్‌వ్యవస్థీకరించనున్నారు.
● జోనల్ వ్యవస్థలను విస్తరించడంతో పాటు జోనల్‌స్థాయి కమిషనర్‌లను కూడా నియమించనున్నారు. తద్వారా అన్ని రకాల నిర్మాణరంగ అనుమతులు, లే అవుట్‌లు జోనల్ స్థాయిలోనే అందజేస్తారు. దీంతో మెట్రోపాలిటన్ కమిషనర్ వ్యూహాత్మక ప్రణాళిక, విధాన రూపకల్పనపై ప్రధానంగా దృష్టి సారించేందుకు అవకాశం లభిస్తుంది.
● హెచ్‌ఎండీఏలోని వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన.
మహానగర అభివృద్ధే ధ్యేయం..
పునర్‌వ్యవస్థీకరణ, జోనల్ స్థాయిలో సేవల వికేంద్రీకరణ ద్వారా హైదరాబాద్ మహా నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించేందుకు అవకాశం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు,ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధివంటి ప్రధానమైన కార్యకలాపాలపై కమిషనర్ దృష్టి కేంద్రీకరించనున్నారు. మరోవైపు సమర్థ ల్యాండ్‌పూలింగ్ పథకాన్ని అమలు చేయడంతో పాటు, ఏకీకృత బిల్డింగ్, డెవలప్‌మెంట్ కోడ్‌ను రూపొందించడం, మాస్టర్‌ప్లాన్–2050 రూపకల్పన, డిజిటల్ ట్విన్ టెక్నాలజీ వంటి లక్ష్యాల దిశగా కార్యాచరణ చేపట్టనున్నారు.
హెచ్‌ఎండీఏ పునర్‌వ్యవస్థీకరణకు రంగం సిద్ధం
ట్రిపుల్ ఆర్ వరకు జోనల్ వ్యవస్థ
సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కన్సల్టెన్సీ
సాంకేతిక, ఆర్థిక బిడ్‌లపై దరఖాస్తులకు ఆహ్వానం
కన్సల్టెంట్‌ల ఎంపిక ఇలా..
టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్‌ల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)ని ఆహ్వానించారు. కన్సల్టెంట్ ఎంపిక క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసీబీఎస్) పద్ధతిలో 80:20 నిష్పత్తిలో జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆర్‌ఎఫ్‌పీలో పేర్కొన్న అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అర్హత సాధించిన బిడ్డర్ల ఫైనాన్షియల్ బిడ్‌లను మాత్రమే తెరిచి తుది ఎంపిక చేపడతారు.