‘సోషల్‌’ వార్‌.. పొలిటికల్‌ పోరు! | - | Sakshi
Sakshi News home page

‘సోషల్‌’ వార్‌.. పొలిటికల్‌ పోరు!

Oct 8 2025 8:13 AM | Updated on Oct 8 2025 8:13 AM

‘సోషల్‌’ వార్‌.. పొలిటికల్‌ పోరు!

‘సోషల్‌’ వార్‌.. పొలిటికల్‌ పోరు!

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో కొంత కాలంగా సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న రాజకీయ యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్‌ చానెళ్లను పెయిడ్‌ చానెళ్లుగా మార్చిన పార్టీలు.. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికతో వైరి పార్టీపె విమర్శలు, ప్రతివిమర్శల్ని మరింత ముమ్మరం చేయనున్నాయి. ఓవైపు తమ పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలు.. ప్రత్యర్థి పార్టీ లోపాల్ని అంతకంటే వేగంగా ఎండగడుతున్నాయి. వాయువేగంతో అవి వాట్సప్‌ గ్రూపు ల్లోనూ షేర్‌ అవుతుండటంతో ఏ కామెంట్‌ ఎప్పుడు వైరల్‌గా మారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌ తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్‌ భార్య సునీతను ప్రకటించింది. కాంగ్రెస్‌లో అభ్యర్థి ఎవరో ఇంకా తెలియదు. నామినేషన్ల దాఖలుకు కూడా ఇంకా సమయముంది. ఇంతెందుకు ఎన్నికల షెడ్యూలు వెలువడకముందే.. ఇప్పటికే కొంతకాలంగా బీఆర్‌ఎస్‌, కాంగెరస్‌ ఒకదానిపై మరొకటి సోషల్‌మీడియా వేదికగా తీవ్ర యుద్ధమే చేస్తున్నాయి. తమ పార్టీల పేరిట, పార్టీ సైన్యాల పేరిట ప్రత్యర్థులపై ఇవి విసురుతున్న విమర్శనాస్త్రాలు ప్రజల అరచేతిలోని మొబైల్‌కు తీరిక లేకుండా చేస్తున్నాయి.

ఎవరి సత్తా వారిదే..

అధికార పార్టీ కాంగ్రెస్‌ తాము చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తదితరాల అప్‌డేట్స్‌ను చేరవేయడంతో పాటు బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో చేసిన విధ్వంసాలు, నిర్వాకాలు అంటూ రూపొందించిన దృశ్యాల్ని ప్రజల్లోకి వెళ్లేలా చేస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో ఎప్పటినుంచో బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ను తూర్పారబడుతోంది. ‘అప్పుడెట్లుండె పాలన.. ఎప్పుడేమైంది? అంటూ ప్రజల్లో కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. అంతేకాదు.. ప్రజాభిప్రాయాల పేరిట అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్‌ఎస్‌ రెండూ వేటికవిగా తమ అనుకూల చానెళ్ల ద్వారా తమ పార్టీకే ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. సొంతంగా వాట్సప్‌ చానెళ్లనూ నిర్వహిస్తున్నాయి. ఇన్‌ఫ్లూయెన్సర్లు, పెయిడ్‌ క్యాంపెయిన్లు, కంటెంట్‌ క్రియేషన్‌, రాజకీయ వ్యూహాల్లో ప్రధాన భాగమయ్యాయి.

రీల్స్‌తో రిప్లయ్‌లు..

వీడియోలతో ప్రచారం, రీల్స్‌తో రిప్లయ్‌లు, ట్రెండ్‌గా మారాయి. ఇక ఆ పార్టీల సోషల్‌మీడియా టీమ్స్‌, వారియర్స్‌ నిర్విరామంగా పని చేస్తున్నాయి. ఇదంతా రూ.కోట్ల మేర ప్రచారమని సంబంధిత రంగం గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సగటు ఓటర్లు సైతం సోషల్‌మీడియాకు ప్రభావితమవుతున్నారు. ఏ పార్టీ ప్రచారం విస్తృతంగా ఉంటే దాని వలలో పడే పరిస్థితి ఏర్పడింది. పార్టీలకు సైతం గ్రౌండ్‌ లెవెల్‌ ఫీడ్‌బ్యాక్‌ కంటే సోషల్‌ మీడియా కామెంట్‌ సెక్షన్‌, ఫీడ్‌బ్యాక్‌, లైక్స్‌, కీలకంగా మారాయి. ఈ పరిణామాలతో జూబ్లీహిల్స్‌ రాజకీయాలు హ్యాష్‌ట్యాగ్స్‌తో జరుగుతున్నాయి. ఓటర్లు స్క్రోల్స్‌, థంబ్‌నెయిల్స్‌తో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారానికి పార్టీల తొందర

నామినేషన్లు ప్రారంభం కాకున్నా,అభ్యర్థులెవరో తెలియకున్నా..

క్షేత్రస్థాయి కంటే సోషల్‌ మీడియాలో ముమ్మరం

రాజకీయ వ్యూహంలో రీల్స్‌, పెయిడ్‌ క్యాంపెయిన్‌లు

దూసుకుపోతున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement