
జిల్లా ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు: ఆర్‌వీ కర్ణన్
లక్డీకాపూల్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా ఫిర్యాదుల కమిటీనీ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున జిల్లా పరిధిలో ప్రయాణం చేసే పౌరులు పరిమిత మొత్తంలో నగదు లేదా విలువైన వస్తువులు మాత్రమే తీసుకెళ్లాలని ఆయన సూచించారు. నగరంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు (ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు (ఎస్‌ఎస్‌టీ) నిరంతరం తనిఖీలు చేపడుతూ.., అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుంటాయన్నారు. సరైన ఆధారాలు చూపకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. నగదు జప్తుకు సంబంధించి జిల్లా ఫిర్యాదుల కమిటీకి తగిన ఆధారాలు పౌరులు చూపితే ఎన్నికల నిబంధనల మేరకు పరిశీలించి జప్తు చేసిన నగదును తిరిగి అందజేస్తామన్నారు. జిల్లా ఫిర్యాదుల కమిటీ సభ్యులు, వారి మొబైల్ నంబర్లు ఇలా ఉన్నాయి.. కేఏ మంగతాయారు, అదనపు కమిషనర్ (ఎస్టేట్స్), జీహెచ్‌ఎంసీ, 91776 08271, (కమిటీ చైర్ పర్సన్), ఎస్.వెంకటేశ్వర్‌రెడ్డి, చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్, ఎన్నికల వ్యయం పర్యవేక్షణ నోడల్ ఆఫీసర్ 91212 40116, (కమిటీ కన్వీనర్), వసుంధర, డిప్యూటీ డైరెక్టర్, డీటీఓ, 98490 44893, (సభ్యురాలు). జిల్లా ఫిర్యాదుల కమిటీ కార్యాల యం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం (3వ అంతస్తు, ట్యాంక్ బండ్)లోని అదనపు కమిషనర్ (ఎస్టేట్స్) చాంబర్‌లో ఉంటుందని, ఫిర్యాదుదారులు, పౌరులు ఈ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆర్‌వీ కర్ణన్ సూచించారు.