
సెల్‌ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తే...
ఇక కఠిన చర్యలు తప్పవు
సాక్షి, సిటీబ్యూరో: సెల్‌ఫోన్ డ్రైవింగ్ కారణంగా 2023లో 23 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... ముగ్గురు అసువులు బాశారు. మరో 26 మంది క్షతగాత్రులయ్యారు. ఒకప్పుడు కేవలం సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపే డ్రైవర్లు మాత్రమే రోడ్లపై కనిపించే వాళ్లు. అయితే ప్రసుత్తం మారిన పరిస్థితుల నేపథ్యంలో సెల్‌ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేసే వారి సంఖ్యా పెరిగింది. ఈ విషయాన్ని గమనించిన నగర కొత్వాల్ సజ్జనర్ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూసే, ఇయర్ ఫోన్లు వినియోగించే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులకు స్పష్టం చేశారు.
తప్పనిసరిగా మారిపోయిన సెల్‌ఫోన్...
మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహనం నడిపే సమయంలో సెల్‌ఫోన్ వినియోగించడం తీవ్రమైన ఉల్లంఘన. ఒకప్పుడు ఈ ఉల్లంఘనలను గుర్తించడం, బాధ్యుతలపై చర్యలు తీసుకోవడం ట్రాఫిక్ పోలీసులకు తేలిగ్గా సాధ్యమయ్యేది. అయితే ఇటీవల కాలంలో యాప్ ఆధారంగా నడిచే బైక్ ట్యాక్సీలు, క్యాబ్‌లు, గిగ్ వర్కర్లు వచ్చిన తరవాత పరిస్థితులు మారిపోయాయి. వీరి కార్యకలాపాలకు సంబంధించి బుకింగ్ దగ్గర నుంచి డెలివరీ వరకు, పికప్ దగ్గర నుంచి డ్రాపింగ్ వరకు అంతా యాప్ ఆధారంగానే సాగుతుంది. దీంతో ఈ రంగంలో ఉన్న ప్రతి డ్రైవర్ సెల్‌ఫోన్‌ను చూడటం, మాట్లాడటం అనివార్యంగా మారిపోయింది. దూరప్రాంతాల సర్వీసుల్లో వెళ్లే ఆర్టీసీ డ్రైవర్లు సైతం తమ ప్రయాణికులతో సంప్రదింపులు జరపడానికి సెల్‌ఫోన్ వినియోగించాల్సి వస్తోంది. ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సైతం చాలా సందర్బాల్లో సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
‘ఇయర్’తో ఇంకో సమస్య వస్తోంది...
నగర వ్యాప్తంగా ఇయర్ ఫోన్ డ్రైవింగ్ సైతం సాధారణ అంశంగా మారిపోయింది. ప్రధానంగా యువతే ఈ రకంగా వాహనాలు నడుపుతున్నారు. ఇయర్ ఫోన్లు, బ్లూటూత్, బడ్స్, పోర్డ్స్ చెవిలో పెట్టుకుని ముందుకుసాగుతుంటారు. బైక్ ట్యాక్సీలు, క్యాబ్‌లు, గిగ్ వర్కర్లు కూడా ఇది తప్పనిసరిగా మారిపోయింది. సెల్‌ఫోన్ డ్రైవింగ్ కన్నా ఇలాంటి ఇయర్ ఫోన్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో చార్జ్‌షీట్లు సైతం
దాఖలు చేసినా...
ఒకప్పుడు సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఇయర్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ చిక్కిన వారికి ట్రాఫిక్ పోలీసుల కేవలం జరిమానా మాత్రమే విధించే వారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనల్ని మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ప్రమాదకరంగా మారేవి, ఎదుటి వ్యక్తికి ప్రమాదకరంగా పరిగణించేవి, వాహనం నడిపే వారితో పాటు ఎదుటి వారికీ ముప్పు తీసుకువచ్చేవి. సెల్/ఇయర్ ఫోన్ డ్రైవింగ్‌కు ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ మూడో కేటగిరీలోకి చేర్చారు. ఈ ఉల్లంఘనులకు కేవలం జరిమానా విధించడం కాకుండా కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయాలని 2018లో నిర్ణయం తీసుకున్నారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ కంటే ప్రమాదకరమైంది కావడంతో తొలిదశలో ఇయర్ ఫోన్ డ్రైవింగ్‌పై దృష్టి పెట్టారు. కోర్టులో చార్జ్‌షీట్లు దాఖలు చేయడానికి అనువుగా దీనికంటూ ఎంవీ యాక్ట్‌లో ప్రత్యేక సెక్షన్ లేదు. దీంతో ప్రమాదకరంగా వాహనం నడపటం (సెక్షన్ 184) కింద అభియోగపత్రాలు దాఖలు చేశారు. కాలక్రమంలో ఆ విధానం అటకెక్కడంతో మళ్లీ జరిమానాలకే పరిమితం అయ్యారు.
సిటీలో సెల్‌ఫోన్ డ్రైవింగ్
కేసులు ఇలా..
ఏడాది నమోదైన కేసులు
2014 13,008
2015 27,333
2023 58,056
2024 78,108
‘బ్లూటూత్’ను ఎలా గుర్తిస్తారో?
అప్పట్లో ట్రాఫిక్ పోలీసులు ‘ఇయర్ ఫోన్’ డ్రైవింగ్ చేస్తున్న వారిని పట్టుకున్నారు. వీరి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకున్న అధికారులు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో (టీటీఐ) కౌన్సిలింగ్ అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేస్తూ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆరుగురిని రెండు రోజుల చొప్పున జైలు శిక్ష కూడా విధించింది. ద్విచక్ర వాహన చోదకుడు ఇయర్‌ఫోన్/సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తుంటే గుర్తించడం తేలికే. వీరితో పాటు కార్లలో వెళ్తున్న వారు బ్లూటూత్స్, బర్డ్స్ వాడుతున్న వారిని పట్టుకోవడం ఎలా అన్నదే ప్రధాన సమస్య. మరోపక్క బైక్ ట్యాక్సీలు, క్యాబ్‌లు, ఆటోలు, గిగ్ వర్కర్లకు ఈ సెల్‌ఫోన్ అనివార్యమైన సాధనంగా మారిపోయింది. ఇలాంటి వాళ్లు ఆ ఫోన్‌ను తమ వృత్తికోసమే వాడుతున్నారా? వీడియోలు చూస్తున్నారా? అనేది గుర్తించడం కష్టసాధ్యం. ఇటీవల కాలంలో కార్లలో బ్లూటూత్స్ వినియోగిస్తున్న నేపథ్యంలో వారిని ఎలా పట్టుకుంటారు? ఇలాంటి వాహనాల్లో తిరుగుతూ పెద్ద ఎత్తున మ్యూజిక్ వినే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది కీలకంగా మారింది.