
యాక్ట్..బిగ్ బాస్కెట్!
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ ఫైబర్..నిత్యావసరాల డెలివరీ సంస్థ బిగ్ బాస్కెట్ పేర్లు చెప్పి సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఇద్దరికి టోకరా వేశారు. మొత్తం రూ.3.06 లక్షలు కోల్పోయిన బాధితులు సోమ, మంగళవారాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బహదూర్‌పురకు చెందిన యువకుడు (30) ఈ నెల ఒకటిన వైఫై సేవల కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు. అందులో యాక్ట్ ఫైబర్ కస్టమర్ కేర్ పేరుతో కనిపించిన నెంబర్‌కు ఫోన్ చేశాడు. దీన్ని అందుకున్న వ్యక్తి మరో నెంబర్ ఇచ్చి దానికి కాల్ చేయమని చెప్పారు. యువకుడు ఫోన్ చేయడానికి ముందే ఆ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. యాక్ట్ ఫైబర్ ప్రతినిధిగా మాట్లాడిన అవతలి వ్యక్తి వైఫై రిజిస్ట్రేషన్ కోసం గూగుల్ పే ద్వారా రూ.2 చెల్లించాలని కోరాడు. ఆపై రిజిస్ట్రేషన్‌ను ఖరారు చేయడానికి 90500, 8500 కోడ్స్ టైప్ చేయాలని సూచించాడు. నిజమే అని నమ్మిన బాధితుడు అలానే చేయగా..గూగుల్ పే ద్వారా అతడి ఖాతా నుంచి రూ.90,500, రూ.8,500 సైబర్ నేరగాడి ఖాతాలోకి వెళ్లిపోయాయి. దీనిపై ఫోన్ ద్వారా బాధితుడు అవతలి వ్యక్తిని ప్రశ్నించాడు. అది పొరపాటున జరిగి ఉంటుందని, 24 గంటల్లో రీఫండ్ కావడానికి పేస్‌యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించాడు. బాధితుడు అలా చేయగానే..దాని ద్వారా సైబర్ నేరగాడు మరో రూ.10 వేలు స్వాహా చేశాడు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు తన బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేయించి, సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించాడు. ఇదిలా ఉండగా... యూసుఫ్‌గూడకు చెందిన మరో వ్యక్తికి (36) గత నెల 30న ఓ వెబ్‌సైట్‌లో అతి తక్కవ ధరలకు నిత్యావసరాల సరఫరా పేరుతో ఉన్న ప్రకటన చూశాడు. దాని ద్వారా తనకు అవసరమైన కొన్ని సరుకులు ఆర్డర్ చేశాడు. ఈ నెల 2న బాధితుడికి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. నిత్యావసరాల సరఫరా సంస్థ బిగ్ బాస్కెట్ కస్టమర్ కేర్ ప్రతినిధిగా అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆర్డర్ చేసిన వస్తువులు పంపడానికి నగదు చెల్లించాలని సూచించాడు. దీనికోసం ఏపీకే ఫైల్‌ను వాట్సాప్ ద్వారా పంపి క్లిక్ చేయమని కోరారు. బాధితుడు అలా చేయడంతో ఆ ఫైల్ అతడి ఫోనులో నిక్షిప్తమై, దాని యాక్సస్ మొత్తం సైబర్ నేరగాడి చేతికి వెళ్లిపోయింది. ఆపై బాధితుడు నిత్యావసరాల నిమిత్తం చెల్లించాల్సిన రూ.360 ఆన్‌లైన్‌లో పే చేశాడు. ఫోన్ యాక్సస్ మొత్తం సైబర్ నేరగాడి చేతిలో ఉండటంతో ఈ ఓటీపీలు, పిన్ నెంబర్లు అతడు సంగ్రహించగలిగాడు. ఆ వివరాలను వినియోగించుకున్న సైబర్ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి రూ.1.97 లక్షల కాజేశాడు. ఈ రెండు ఉదంతాలపై కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ పేర్లతో ఇరువురిని మోసం చేసిన నేరగాళ్లు
ఇద్దరు బాధితుల నుంచి రూ.3.06 లక్షలు స్వాహా
సైబర్ క్రైమ్ ఠాణాలో వేర్వేరుగా కేసులు నమోదు