హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌లపై నకిలీ దందా! | - | Sakshi
Sakshi News home page

హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌లపై నకిలీ దందా!

Oct 7 2025 4:54 AM | Updated on Oct 7 2025 4:54 AM

హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌లపై నకిలీ దందా!

హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌లపై నకిలీ దందా!

‘సయామ్‌’లో అక్షరాలు మార్చి వెబ్‌సైట్‌ల మాయాజాలం

సాక్షి, సిటీబ్యూరో: వాహనాల హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ప్లేట్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ)లపై నకిలీ వెబ్‌సైట్‌లు దందా కొనసాగిస్తున్నాయి. కొత్తగా నమోదయ్యే వాహనాలతో పాటు పాతవాహనాలకు సైతం హెచ్‌ఎస్‌ఆర్‌పీని కచ్చితంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఈ మేరకు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫాక్చర్‌ (ఎస్‌ఐఏఎం–సయామ్‌) అనే సంస్థకు ఆ బాధ్యతలను అప్పగించారు. హైసెక్యూరిటీ నెంబర్‌ప్లేట్‌ల ఏర్పాటు పైన 15 రాష్ట్రాల్లో ఈ సయామ్‌ సంస్థ సేవలందజేస్తోంది. వాహనదారులు సయామ్‌ వెబ్‌సైట్‌లో హెచ్‌ఎస్‌ఆర్‌పీ కోసం దరఖాస్తు చేసుకున్న అనంతరం నిర్ణీత గడువు మేరకు కొత్త నెంబర్‌ప్లేట్లను అందజేస్తారు. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రం షోరూమ్‌లలోనే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కేరళ, కర్ణాటక, గుజరాత్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, ఏపీ తదితర రాష్ట్రాల్లో సయామ్‌ ద్వారా పెండింగ్‌ వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌లను అందజేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం హెచ్‌ఎస్‌ఆర్‌పీపైన ఇప్పటి వరకు ఎలాంటి తుదిగడువును విధించలేదు. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు ‘సయామ్‌’ పేరిట నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి ఇటీవల వాహనదారులకు పెద్ద ఎత్తున నోటీసులు అందజేశారు. హైసెక్యూరిటీ నెంబర్‌ప్లేట్‌లు లేకుండా తిరిగే వాహనాలపైన భారీ ఎత్తున జరిమానా విధించనున్నట్లు ‘ఆర్టీఏ చలాన్‌ల’ పేరిట వాహనదారులకు నోటీసులు ఇచ్చి గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో రవాణాశాఖ అప్రమత్తమైంది. హెచ్‌ఎస్‌ఆర్‌పీ కోసం తాము ఎలాంటి నోటీసులు ఇవ్వడం లేదని పేర్కొంది. అయినప్పటికీ వాహనదారుల్లో ఇంకా ఈ గందరగోళంకొనసాగుతూనే ఉంది. ‘సయామ్‌’ వెబ్‌సైట్‌ను పోలిన విధంగా ఒకటి, రెండు అక్షరాలను మార్చి మాయాజాలం సృష్టిస్తున్నారని, అలాంటి వెబ్‌సైట్ల నుంచి వచ్చే మెసేజ్‌లను చూసి మోసపోవద్దని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

గ్రేటర్‌లో 45 లక్షలకు పైగా పెండింగ్‌...

వాహనాల భద్రతను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు హెచ్‌ఎస్‌ఆర్‌పీని తప్పనిసరి చేసింది. ఈ మేరకు 2013లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం దీన్ని అమల్లోకి తెచ్చింది. కానీ ఈ పథకం ఏళ్లకు ఏళ్లుగా నత్తనడకన సాగుతుంది. తెలంగాణలో సుమారు 65 లక్షలకు పైగా వాహనాలు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. వాటిలో 45 లక్షల వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్నాయి. 2019 వరకు నమోదైన అన్ని వాహనాలకు ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి హెచ్‌ఎస్‌ఆర్‌పీని అమర్చాలని సుప్రీంకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. కానీ నగరంలో మాత్రం ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదని, దీంతో తాము ఇప్పటి వరకు ఎలాంటి తుది గడువును విధించలేదని ఆర్టీఏ అధికారులు తెలిపారు. మొదట్లో ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఏర్పాటు చేసుకోవాలంటూ వెలువడిన ఒక ఉత్తర్వు వాహనదారులను గందరగోళానికి గురిచేసింది. దీంతో చాలామంది ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లి అధికారులను సంప్రదించారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ‘సయామ్‌’ ద్వారా ఈ పథకం అమలు జరుగుతున్న క్రమాన్ని అవకాశంగా తీసుకొని నకిలీవెబ్‌సైట్‌లు రంగంలోకి దిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఇప్పటికీ తప్పనిసరి కాదు...

‘హెచ్‌ఎస్‌ఆర్‌పీపైన ప్రభుత్వం ఇంకా ఎలాంటి గడువు విధించలేదు. భవిష్యత్తులో గడువు విధించే వరకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ కోసం ఎలాంటి వెబ్‌సైట్‌లను ఆశ్రయించవలసిన అవసరం లేదు. దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత మాత్రమే స్పష్టమైన విధివిధానాలను విడుదల చేస్తాం. అప్పటి వరకు వాహనదారులు ఎలాంటి గందరగోళానికి, ఆందోళనకు గురికావలసిన అవసరం లేదు’. అని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ తప్పనిసరన్న సుప్రీంకోర్టు

గ్రేటర్‌లో సుమారు 45 లక్షల వాహనాలు పెండింగ్‌

ఇప్పటి వరకు ఎలాంటి గడువు విధించలేదంటున్న రవాణాశాఖ

నకిలీసైట్‌ల దందాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

నాణ్యతపై సందేహాలు....

హైసెక్యూరిటీ నెంబర్‌ప్లేట్‌లలో నాణ్యత లేకపోవడం వల్ల కూడా వాహనదారులు విముఖత చూపుతున్నారు.

తెలుపురంగు ప్లేట్‌లపై నెంబర్లను ఎంబోజింగ్‌ చేసి నలుపురంగు పెయింట్‌ వేస్తారు.కానీ ఈ రంగు ఎక్కువ కాలం ఉండడం లేదు.

ప్లేట్‌లు కూడా నాసిరకంగా ఉండి తొందరగా దెబ్బతింటున్నాయి. సొట్టలు పడుతున్నాయి. విరిగి ముక్కలవుతున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

ఈ నెంబర్‌ ప్లేట్లు ఆకర్షణీయంగా లేకపోవడం కూడా మరో కారణం.

రూ.లక్షల ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసి ఇలాంటి నాసిరకం ప్లేట్‌లు అమర్చుకునేందుకు అయిష్టత చూపుతున్నారు.

కానీ 2019 నాటికి నమోదైన అన్ని వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ తప్పనిసరి అన్న సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా కదలిక వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement