
అక్రమ లేఔట్లు... రహదారుల ఆక్రమణలు!
సాక్షి, సిటీబ్యూరో: అనుమతి లేని లేఔట్లతో పాటు ఆక్రమణలకు గురవుతున్న రహదారులపై పలువురు హైడ్రాను ఆశ్రయిస్తున్నారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ద్వారా 41 ఫిర్యాదులు అందాయి. బొల్లారం మున్సిపాలిటీలోని ఎన్‌రిచ్ ప్రాంతంలోని సర్వే నం.83లో ఉన్న వరకుంట చెరువు కబ్జాల నిరోధించాలని, నిజాంపేట సర్వే నం.233/15లో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. మాజీ సైనికోద్యోగికి జవహార్‌నగర్‌లో ప్రభత్వం ఇచ్చిన భూమిని కొందరు కబ్జా చేశారని ఫిర్యాదు చేరని ఆయన కుమారుడి ద్వారా ఫిర్యాదు అందింది. అయ్యప్ప సొసైటీలో 28వ ప్రధాన రహదారి 60 అడుగుల వెడల్పుతో ఉండాల్సి ఉండగా ఆక్రమణలకు గురైందని, అక్కడి డబ్బాలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. గతంలో ఖాళీ చేయించినా మళ్లీ డబ్బాలు పెట్టారని, వీటిని తీయమంటే రూ. 40 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బౌరంపేటలోని సర్వే నం. 166/3లోని ప్రభుత్వ భూమిలో ఎగువన ఉన్న వెంచర్ల కోసం రహదారి నిర్మిస్తున్నారని ఫిర్యాదు అందింది. హయత్‌నగర్ మండలంలోని ఆదిత్యనగర్–బాలాజీ నగర్ మధ్య రెండు లింకు రోడ్లు ఆక్రమణకు గురయ్యాయని, పార్కు స్థలం కూడా కబ్జా అయిందని ఆదిత్యనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాను కోరింది. మేడిపల్లి మండలం సాయిప్రియానగర్‌లో 2500 ప్లాట్లతో లే ఔట్ వేశారు. ఇందులో 2 వేల గజాల్లో ఉండాల్సిన పార్కును కూడా ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు.
హైడ్రాను అభినందించిన హైకోర్టు...
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పని తీరును హైకోర్టు అభినందించిందని అధికారులు సోమవారం ప్రకటించారు. తమ విభాగం చెరువుల అభివృద్ధిని యజ్ఞంలా చేస్తోందని కితాబిచ్చినట్లు పేర్కొన్నారు. బతుకమ్మకుంటను అభివృద్ధి చేసిన తీరు హర్షణీయమని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి సోమవారం వ్యాఖ్యానించినట్లు ప్రకటించింది. బతుకమ్మకుంట ఆ పరిసర ప్రాంతాలకు వరద ముప్పు తప్పించడమే కాకుండా భూగర్భ జలాలను కూడా పెంచిందని, గచ్చిబౌలిలోని మల్కం చెరువును చూసినా ఆహ్లాదంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించినట్లు హైడ్రా పేర్కొంది. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఇంటి స్థలాలు, భూములు ఉంటే ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) కింద వారికి సరైన నష్టపరిహారం ఇవ్వాలని సూచించినట్లు పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వం సమగ్ర విధానాన్ని తీసుకురావాలని హైకోర్టు అభిప్రాయపడినట్లు తెలిపారు. మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు పరిధిలోని రెండు ఎకరాలకు సంబంధించిన టీడీఆర్ కేసు విచారణ సందర్భంలో ఇది చోటు చేసుకుందని హైడ్రా తెలిపింది.
ప్రజావాణి ద్వారా హైడ్రాకు 41 ఫిర్యాదులు