
మెట్రో కిటకిట
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికుల రాకపోకలతో సోమవారం నగరంలోని పలు మెట్రోస్టేషన్లు, మెట్రోరైళ్లు కిటకిటలాడాయి. దసరా సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లిన ప్రయాణికులు నగరానికి తిరిగి చేరుకోవడంతో వివిధ ప్రాంతాల్లో మెట్రోస్టేషన్లలో రద్దీ నెలకొంది. విజయవాడ వైపు నుంచి పలు ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్నవాళ్లు ఎల్‌బీనగర్ మెట్రోస్టేషన్ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు బయలుదేరారు. దీంతో ఎల్‌బీనగర్ మెట్రో వద్ద ఉదయం నుంచి ఇంచుమించు మధ్యాహ్నం వరకు ప్రయాణికుల సందడి నెలకొంది. అలాగే నగరంలోని ప్రధాన మెట్రో స్టేషన్‌లైన నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్ ఈస్ట్, అమీర్‌పేట్, రాయదుర్గం, లక్డీకాపూల్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, మియాపూర్ తదితర స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరోవైపు దసరా అనంతరం శని, ఆదివారాలతో పాటు సోమవారం కూడా నగరవాసులు సొంత ఊళ్ల నుంచి పెద్ద సంఖ్యలో నగరానికి చేరుకున్నారు. తిరుగుప్రయాణం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ డిమాండ్ మేరకు అందుబాటులో లేకపోవడం వల్ల జిల్లా కేంద్రాల్లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సివచ్చిందని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న రైళ్లతో సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి, లింగంపల్లి స్టేషన్‌లలో సందడి కనిపించింది. సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున నగరానికి చేరుకున్నారు. దీంతో విజయవాడ, వరంగల్, కరీంనగర్, తదితర ప్రధాన రహదారుల్లోని శివారు ప్రాంతాల్లో భారీ రద్దీ కారణంగా వాహనాలు స్తంభించాయి.
ఎల్‌బీనగర్‌లో వాహనాల రద్దీ
మెట్రో రైలు స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ
సొంత ఊళ్ల నుంచి సిటీకి చేరుకున్న నగరవాసులు
ప్రయాణికుల రాకపోకలతో సందడిగా స్టేషన్లు
రహదారులపైన భారీగా రద్దీ