‘హైడ్రా’మా నేనా? | - | Sakshi
Sakshi News home page

‘హైడ్రా’మా నేనా?

Oct 7 2025 4:51 AM | Updated on Oct 7 2025 10:24 AM

fence erected by Hydra was removed..

హైడ్రా వేసిన కంచె తొలిగించి ఇలా..

గాజులరామారం సర్వే నెం.307లో కూల్చివేతలు

వారం రోజుల్లోనే మళ్లీ ఫెన్సింగ్‌ వేసిన ఎమ్మెల్యే 

ఆ భూమి తమదేనంటూ ప్రెస్‌మీట్‌ సైతం నిర్వహణ

సాక్షి, సిటీబ్యూరో:

 సెప్టెంబర్‌ 21: 

గాజులరామారంలోని సర్వే నెం.307లో ఉన్న రూ.15 వేల కోట్ల విలువైన 317 ఎకరాల స్థలం ప్రభుత్వానిదని ప్రకటించిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీకి ఆధీనంలో ఉన్న 11 ఎకరాల చుట్టూ ఉన్న షీట్లను తొలగించి ఫెన్సింగ్‌ వేసింది.

సెప్టెంబర్‌ 23:

ఆ స్థలం తనదేనని, పట్టా భూమి కొనుగోలు చేశానని ప్రకటించిన ఆరికపూడి గాంధీ హైడ్రా అక్కడ వేసిన ఫెన్సింగ్‌ తొలగించారు. దాని స్థానంలో గతంలో మాదిరిగానే బ్లూషీట్లు ఏర్పాటు చేశారు. హైడ్రా చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అక్టోబర్‌ 1:

ఆరికపూడి గాంధీ చెరలో ఉన్న ప్రభుత్వం భూమినీ పరిరక్షించాలంటూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా సహా వివిధ విభాగాలకు దరఖాస్తులు ఇచ్చారు. ఆ స్థలం తనదేనని, ఆరోపణలు చేస్తే కోర్టు కీడుస్తానంటూ గాంధీ ప్రకటించారు. హైడ్రా మాత్రం ఈ భూమి విషయంలో మిన్నకుండిపోయింది.

పక్షం రోజులు సాగిన ఈ ఎపిసోడ్‌లో నష్టపోయింది మాత్రం 260 నిరుపేద కుటుంబాలే. గాజులరామారంలోని సర్వే నెం.307లో ఉన్న ప్రభుత్వ భూమిలోని వెంచర్లు, లే ఔట్లకు సంబంధించిన ఈ నిర్మాణాలను హైడ్రా గత నెల 21న తొలగించింది. ప్రగతినగర్‌ వైపు కబ్జా చేసిన వారిలో రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థల యజమానులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నట్లు ప్రకటించింది. ఈ సర్వే నెంబర్‌లో 317 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో దీన్ని ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు నాటి సర్కారు అప్పగించింది. రాష్ట్ర విభజన తర్వాత ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆస్తుల పంపకాల్లో జాప్యం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు ఆక్రమణలకు పాల్పడ్డారు. ఈ విషయంపై హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఆరు నెలల పాటు సాగిన విచారణలో భాగంగా రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధికారులతో ఐదారుసార్లు సమావేశమై అనేక విషయాలు గుర్తించింది.

బాధ్యులపై చర్యలేవి?

ఈ భూమిలో ప్రగతినగర్‌ వైపు బడాబాబులు వెంచర్లు, లే ఔట్లు వేశారని, సర్వే నంబర్లు 329/1, 342ల్లో ఉన్న భూమిని 60 గజాలు, 120 గజాల చొప్పున ప్లాట్లు వేసిన రౌడీషీటర్లు, స్థానిక నేతలు పేదలకు విక్రయించారు. జగద్గిరిగుట్ట పోలీసుస్టేషన్‌లో రౌడీషీటర్‌గా ఉన్న షేక్‌ అబిద్‌... లక్ష్మి మురళి హుస్సేన్‌ పేరుతో ఈ విక్రయాలు జరిపారు. బోడాసు శ్రీనివాస్‌ (డాన్‌ శీను), ఏసుబాబు, సయ్యద్‌ గౌస్‌ బాబు, మనీష్‌, దేవా తదితరులూ భూమిని ఆక్రమించి, ప్లాట్లుగా అమ్మేశారు. వీరికి స్థానిక రెవెన్యూ అధికారులు సహకరించారు. వీటిలో నిర్మించిన గదులను కొందరు అద్దెలకు కూడా ఇచ్చారు. ఇలా ఆ ప్రభుత్వ భూమిలో ఉన్న 12 ఎకరాల వెంచర్‌తో పాటు 20 ఎకరాల లే ఔట్‌ను హైడ్రా తొలగించింది. నిర్మాణాలను కూల్చివేసిన అందుకు బాధ్యులైన అధికారులపై మాత్రం చర్యలు తీసుకోలేదు.

హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఆర్‌ఎల్‌ఆర్‌...

హైడ్రా కూల్చివేతలు చేపట్టిన భూమిలో 11 ఎకరాలు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ బంధువుల పేర్లపై ధరణిలో చేర్చింది ప్రభుత్వ భూమి అంటూ బీఆర్‌ఎస్‌ నేత రాగిడి లక్ష్మారెడ్డి (ఆర్‌ఎల్‌ఆర్‌) హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తమ పేరిట ఉన్న 11 ఎకరాలను ఎప్పుడో విక్రయించి వెళ్లిపోయిన జాహెద్‌ బేగం, షేక్‌ ఇమామ్‌, ఇశాన్‌ అమీన్‌ను తీసుకొచ్చి వారి పేరిట భూమిని కొన్నట్లు చూపించారని ఆరోపించారు. గత బుధవారం హైడ్రా కమిషనర్‌కు కలిసిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ భూ ఆక్రమణకు పాల్పడిన ఆరికపూడి గాంధీపై ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు గత నెల 21న తమ భూమిలో చేపట్టిన కూల్చివేతలపై తాము హైకోర్టును ఆశ్రయించామని ఆరికపూడి గాంధీ అదే రోజు ప్రకటించారు. దీనిపై హైడ్రా ఆ భూమిలోకి ప్రవేశించకుండా ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. తనపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పుడు హైడ్రా వ్యూహం ఎలా ఉంటుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Fenced By Hydra1
1/1

ఆ తరువాత కంచె వేసిన హైడ్రా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement