అడిగిన సమాచారం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

అడిగిన సమాచారం ఇవ్వండి

Oct 7 2025 4:51 AM | Updated on Oct 7 2025 10:31 AM

Anil Kumar Reddy, Deputy Commissioner of Excise Department

ఎక్సైజ్‌శాఖ డిఫ్యూటీ కమిషనర్‌ అనిల్‌కుమార్‌రెడ్డి

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ల పరిధిలో ఉన్న 179 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునేవారికి అవసరమైన సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఎక్సైజ్‌శాఖ హైదరాబాద్‌ డిఫ్యూటీ కమిషనర్‌ అనిల్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు సంబంధిత ఎకై ్సజ్‌ స్టేషన్‌లు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సోమవారం అబ్కారీ భవన్‌ సమావేశ మందిరంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిధిలోని 11 ఎక్సైజ్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డీటీఎఫ్‌ టీమ్‌లతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం దుకాణాలకు సంబంధించిన రిజర్వేషన్లు, రెండేళ్లలో మద్యం అమ్మకాల వివరాలను దరఖాస్తుదారులకు ఇవ్వాలని చెప్పారు.అలాగే దరఖాస్తుల సమూనాలో తప్పులు లేకుండా సహకరించాలన్నారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను అబ్కారీ భవన్‌లోని మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న కౌంటర్‌లో దాఖలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయని రోజువారిగా డిస్ప్లే చేయాలని ఎకై ్సజ్‌సూపరింటెండెంట్‌ పంచాక్షరి సూచించారు.

26న ప్రెస్‌క్లబ్‌ ఎన్నికలు

లక్డీకాపూల్‌ : హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 26న క్లబ్‌ కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతాయని ప్రెస్‌క్లబ్‌ప్రధాన కార్యదర్శి రవికాంత్‌ రెడ్డి చెప్పారు. 2025–27 సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ఎన్నుకోనున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా దొడ్డా శ్రీనివాస్‌ రెడ్డి వ్యవహరిస్తారు. ఈ నెల 9వ తేదీ నాటికి సభ్యత్వ రెన్యువల్‌, అన్ని బకాయిలు చెల్లించిన రెగ్యులర్‌ సభ్యులు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని చెప్పారు. కొత్త ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు(జనరల్‌), ఉపాధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి, ఇద్దరు సంయుక్త కార్యదర్శుల పదవులతో పాటు కోశాధికారి, పది మంది కార్యనిర్వాహక సభ్యులు (8 మంది సాధారణ సభ్యులు, రెండు మహిళా రిజర్వ్‌ స్థానాలు) ఎన్నికలు జరుగుతాయన్నారు.

గాలిలో పల్టీలు కొట్టిన కారు

ఫ్లైఓవర్‌పై స్తంభాన్ని ఢీకొట్టి..మరోకారుపై పడి...

ఐదుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

కేపీహెచ్‌బీకాలనీ: జేఎన్టీయూ–హైటెక్‌ సిటీ రోడ్డులో అతివేగంగా వెళ్తూ ఓ కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడమే కాకుండా గాలిలోకి పల్టీలు కొట్టి రోడ్డుకు అవతలి వైపు వెళ్తున్న మరో కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన వికాస్‌శర్మ, శాంతను స్నేహితులు. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ల రోడ్డులో నివాసం ఉండే శాంతను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. వికాస్‌శర్మ ఇంటీరియర్‌ డిజైనర్‌. ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి మియాపూర్‌ ప్రాంతంలో మద్యం తాగారు. సోమవారం తెల్లవారుజామున జేఎన్‌టీయూ వైపు నుంచి హైటెక్‌ సిటీ వైపు టాటా కర్వ్‌ కారులో ఇరువురూ వెళ్తున్నారు. ఆ సమయంలో వికాస్‌శర్మ డ్రైవింగ్‌ చేస్తున్నాడు. నెక్సెస్‌ మాల్‌ ఫ్లైఓవర్‌ మీదుగా వెళ్తున్న వీరు ఫ్లైఓవర్‌ దిగే క్రమంలో అతివేగంగా వెళ్లి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టారు. వీరు ప్రయాణిస్తున్న కారు గాల్లోకి ఎగిరి హైటెక్‌ సిటీ వైపు నుంచి–జేఎన్టీయూ వైపు వెళ్తున్న టాటా సిట్రాన్‌ ఎలక్ట్రిక్‌ కారుపై పడింది. ఈ కారులో నానక్‌రాంగూడలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న ప్రియను దింపేందుకు సంస్థకు చెందిన కారును అఖిల్‌రెడ్డి నడుపుతుండగా సెక్యూరిటీగార్డ్‌గా వచ్చిన సాహిల్‌కుమార్‌ కూడా ఉన్నారు.ఈ ఘటనలో స్నేహితులు వికాస్‌శర్మ, శాంతన్‌తో మరో కారులోని అఖిల్‌రెడ్డితో పాటు అందులో ఉన్న ప్రియ, సాహిల్‌కుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు.కార్లను నడుపుతునన వికాస్‌శర్మ,అఖిల్‌రెడ్డిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐదుగురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

నేడు పలుచోట్ల నీటి సరఫరాకు అంతరాయం

సాక్షి,సిటీ బ్యూరో: హైదరాబాద్‌ మహానగరానికి మంచినీటిని సరఫరాచేసే సింగూరు జలాశయం సింగాపూర్‌ నుంచి ఖానాపూర్‌ వరకు ఉన్న 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్‌ కు మణికొండ కల్వర్టు వద్ద పీఎస్సీ పైపు లైన్‌ దెబ్బతిని ఏర్పడిన భారీ లీకేజీ మరమ్మతులు పనులు నేపథ్యంలో మంగళవారం ఉదయం కొన్ని ప్రాంతాల్లో ప్రెజర్‌ తో నీటిసరఫరా, మరికొన్ని ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి వర్గాలు తెల్పాయి. మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలు, షేక్‌ పేట్‌, హకీంపేట్‌, తౌలిచౌకి, కాకతీయ నగర్‌ లోని కొన్ని ప్రాంతాలు, మెహిదీపట్నం, ఆసిఫ్‌ నగర్‌, కార్వాన్‌, ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement