అమెరికాలో రోడ్డు ప్రమాదం.. చంచల్‌గూడ నివాసి మృతి | - | Sakshi
Sakshi News home page

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. చంచల్‌గూడ నివాసి మృతి

Oct 7 2025 4:51 AM | Updated on Oct 7 2025 10:30 AM

Siraj Motib Mohammed (File Photo)

సిరాజ్‌ మొతీబ్‌ మహ్మద్‌ (ఫైల్)

చాదర్‌ఘాట్‌: అమెరికాలోని చికాగో ఇవన్‌స్టంగ్‌ ప్రాంతంలో నివాసముంటున్న చంచల్‌గూడకు చెందిన సిరాజ్‌ మొతీబ్‌ మహ్మద్‌ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన మేరకు.. కుటుంబ సభ్యులు పది సంవత్సరాల క్రితం అక్కడే సెటిలయినట్లు స్థానికులు తెలిపారు. వరుస సంఘటనలతో అమెరికాలో ఉంటున్న విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

చెరువులో పడి మహిళ మృతి

మోతీనగర్‌: మతిస్థిమితం లేని ఓ మహిళ సున్నం చెరువులో పడి మృతి చెందింది. ఈ సంఘటన అల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సామల వెంకట్‌రెడ్డి తెలిపిన మేరకు.. బోరబండ సైట్‌ 3లో మానిక్కర్‌ ఆండాళు (49) నివాసముంటోంది. ఈ నెల 4న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుమారుడు నవీన్‌కుమార్‌ బంధువులు, మిత్రులు, పరిసర ప్రాంతాల్లో విచారించినా జాడ తెలియరాలేదు. దీంతో 5న బోరబండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలించగా అల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సున్నం చెరువులో ఆమె మృత దేహం లభించింది.

వేడుకల్లో విషాదం..చిన్నారి మృతి

అమీర్‌పేట: నూతన గృహ ప్రవేశ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్‌ షాక్‌తో ఓ చిన్నారి మృతి చెందింది. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. సనత్‌నగర్‌ ఉదయ్‌నగర్‌ కాలనీలో శ్రీరాములు భార్య మానస, కుమార్తెలు మేఘన(8),ప్రణవితో కలిసి ఉంటున్నాడు. సుభాష్‌నగర్‌లో ఉండే సమీప బంధువు వెంకటస్వామి గృహ ప్రవేశానికి శ్రీరాములు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు.రాత్రి ఎనిమిది గంటల సమయంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో భోజనాలు చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు పిల్లలు టెర్రస్‌పై ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తు ఇంటి డెకరేషన్‌ లైట్ల తీగలు తాకి మేఘన స్పృహ కోల్పోయింది. వెంటనే సనత్‌నగర్‌లోని ప్రైయివేటు ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

డివైడర్‌ ఢీకొని వ్యక్తి మృతి

మల్లాపూర్‌: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి ద్విచక్రవాహనంపై వస్తుండంగా డివైడర్‌ను ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు.ఈ సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన మేరకు.. చెంగిచర్ల గణేష్‌నగర్‌ కాలనీకి చెందిన చేర్యాల హైమావతి చిన్న కుమారుడు దిలీప్‌కుమార్‌ (31) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం స్నేహితుడి బర్త్‌డే వేడుకలకు వెళ్లాడు. ఇంటికి ఆలస్యంగా వస్తానని తల్లికి చెప్పాడు. సోమవారం తెల్లవారుజామున ఉదయం 4.25 ఐఐసీటీ గేటు వద్ద యాక్టీవా పై(టీఎస్‌08జీఏ9032) వస్తుండగా ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టాడు. దీంతో దిలీప్‌ కుమార్‌ తలకు తీవ్ర గాయ కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకోని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

నగరంలో ఫేక్‌ డాక్టరేట్ల కలకలం

– నిందితుడి అరెస్ట్‌

లక్డీకాపూల్‌ : నకిలీ డాక్టరేట్‌ సర్టిఫికెట్లు ఇస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రవీంద్రభారతి వద్ద పెద్దిటి యోహాన్‌ను వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సైఫాబాద్‌ పోలీసులు తెలిపిన మేరకు..గుంటూరు జిల్లా గురుజాలకి చెందిన పెద్దిటి యోహాన్‌ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్‌ పేరిట గత కొంత కాలంగా డాక్టరేట్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో వాట్సప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. ఆ గ్రూప్‌ ద్వారా డాక్టరేట్లు ఇస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేలు తీసుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో పలువురికి ఫేక్‌ డాక్టరేట్లను ప్రదానం చేశారు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు వలపన్ని యోహాన్‌ను అదుపులోకి తీసుకుని సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. యోహాన్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్టు సైఫాబాద్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement