
సయ్యద్ అమీర్ (ఫైల్)
ఘట్‌కేసర్: పిల్లలను గొడవపడొద్దు అన్నందుకు ఓ పిల్లాడి తండ్రి అతడిపై దాడిచేశాడు. ఈ సంఘటనలో బాధితుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలోని అవుషాపూర్‌లో ఆదివారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ బాలస్వామి తెలిపిన మేరకు.. అవుషాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ అమీర్ (34) రాళ్లు కొట్టుకుంటు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఇంటిలో ఉండగా సమీపంలో నివసించే షన్ను పిల్లలు అసీనా, అజ్మెద్, సయ్యద్ అలీ కుమారుడు అబు గొడవ పడ్డారు. శబ్దం విన్న సయ్యద్ అమీర్ బయటకు వచ్చిన గొడవ పడొద్దని అబుకు సూచించాడు.
గొడవ వద్దన్నందుకు...
గొడవ పడొద్దన్నాడనే విషయాన్ని అబు తన తండ్రి సయ్యద్ అలీకి చెప్పడంతో అతడొచ్చి సయ్యద్ అమీర్‌పై దాడికి దిగాడు. చుట్టు పక్కల వారు ఇరువురిని శాంత పరిచి ఇంటికి పంపించి వేశారు. అనంతరం అర్థగంట తర్వాత ఛాతి నొప్పితో పాటు వాంతులు కావడంతో కుటుంబీకులకు సయ్యద్ అమీర్ తెలిపాడు. అతడి శరీరానికి చెమటలు పట్టడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
జాతీయ రహదారిపై నిరసన...
అకారణంగా దాడి చేసి ప్రాణం తీసిన సయ్యద్ అలీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు బాఽధితులు పోస్ట్‌మార్టం అనంతరం జాతీయ రహదారిపై మృతదేహాన్ని ఉంచి నిరసన తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నచ్చచెప్పి పంపించి వేశారు. కాగ ఇరు వర్గాల మధ్య ఓ ఒప్పంధం జరిగినట్లు సమాచారం.