
విజయవాడ జాతీయ రహదారిపై..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అసలే నాసిరకం పనులు.. ఆపై ఏకధాటి వర్షాలు.. వరదలు.. ఇంకేముంది గ్రామీణ రహదారులను ఛిద్రం చేశాయి. మారుమూల గ్రామీణ రోడ్లే కాదు.. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారులు సైతం ధ్వంసమయ్యాయి. ఇటు ఎల్బీనగర్ నుంచి అటు బాటసింగారం వరకు విజయవాడ రహదారిపై అడుగుకో గుంతతేలింది. అష్ట వంకరలు తిరిగి.. అనేక మలుపులతో నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న బీజాపూర్ జాతీయ రహదారి (అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ల వరకు) పూర్తిగా దెబ్బతింది.
శంషాబాద్ నుంచి షాద్‌నగర్ వరకు ఉన్న బెంగళూరు జాతీయ రహదారి సహా పహడీషరీఫ్ నుంచి ఆమనగల్లు వరకు విస్తరించి ఉన్న శ్రీశైలం జాతీయ రహదారి, బీఎన్‌రెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా మాల్ వరకు విస్తరించి ఉన్న నాగార్జునసాగర్ రోడ్డు, షాద్‌నగర్ నుంచి తాండూరు వెళ్లే మార్గం, కోకాపేట నుంచి శంకర్‌పల్లి మీదుగా చేవెళ్ల వెళ్లే మార్గం ఎక్కడికక్కడ గుంతలు తేలాయి. దెబ్బతిన్న రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన రోడ్ల భవనాలశాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలు అటు వైపు దృష్టిసారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాకపోకలకు ఇబ్బందులు
ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై నిలిచి ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పాటు రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో రోడ్డుపై ఉన్న తారు, సీసీ దెబ్బతిని కంకర తేలుతోంది. దెబ్బతిన్న ఈ రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.