
నలుగురు పిల్లలతో కలిసి భార్య అదృశ్యం
గౌలిపురా: మద్యం మత్తులో భర్త కొట్టడంతో నలుగురు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైంది. ఈ సంఘటన భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. భవానీనగర్ తలాబ్‌కట్టా సిద్దిఖీనగర్ సమద్ హోటల్ ప్రాంతానికి చెందిన సయీద్ ఉన్నీసా (28), మహ్మద్ ఫెరోజ్ ఖాన్‌లు దంపతులు. వీరికి నలుగురు పిల్లలు. కాగా ఫెరోజ్ ఖాన్ తరచూ మద్యం తాగి వస్తుండటంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.
గత నెల 30న ఫెరోజ్ ఖాన్ మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య మందలించింది. దీంతో ఫరోజ్ ఖాన్ భార్య సయీద్ ఉన్నీసాను కొట్టాడు. ఈక్రమంలో మరుసటిరోజు (ఈ నెల 1న) సాయంత్రం సయీద్ ఉన్నీసా తన నలుగురు పిల్లలను తీసుకొని కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఫెరోజ్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.