పన్నెండేళ్లకు పచ్చజెండా! | - | Sakshi
Sakshi News home page

పన్నెండేళ్లకు పచ్చజెండా!

Aug 1 2025 1:29 PM | Updated on Aug 1 2025 1:29 PM

పన్నెండేళ్లకు పచ్చజెండా!

పన్నెండేళ్లకు పచ్చజెండా!

సాక్షి, సిటీబ్యూరో: పుష్కరకాలం నాటి ప్రతిపాదనలు తిరిగి పట్టాలకెక్కనున్నాయి. హైదరాబాద్‌– సికింద్రాబాద్‌లను కలిపే బేగంపేట్‌ రోడ్‌– రాణిగంజ్‌ క్రాస్‌రోడ్స్‌ మార్గానికి ప్రత్యామ్నాయంగా ఎస్‌పీ రోడ్‌ –నెక్లెస్‌ రోడ్‌ను కలుపుతూ పాటిగడ్డ మీదుగా ఆర్‌ఓబీ (ఫ్లై ఓవర్‌) ప్రాధాన్యతతో నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ, దక్షిణమధ్య రైల్వే అంగీకారానికి వచ్చాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 80 కోట్లు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు.

సమన్వయం, సహకారం లోపంతో..

● ఇక్కడి ఆర్‌ఓబీ ప్రతిపాదన ఈనాటిది కాదు. నగరంలో మెట్రో రైలు పనులు ప్రారంభం కావడాని కంటే ఎంతోకాలం ముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ, ఆయా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, సహకార లోపంతో కాగితాలు దాటి పనులు మొదలు కాలేదు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే బేగంపేట వైపు నుంచి ఖైరతాబాద్‌, సెక్రటేరియట్‌ల వైపు వచ్చే వారికి ఎంతో సమయం ఆదా అవుతుంది. సెక్రటేరియట్‌– ట్యాంక్‌బండ్‌– ప్యారడైజ్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది. అప్పటి అంచనా వ్యయం రూ.25 కోట్లు ప్రస్తుతం రూ. 80 కోట్లయింది.

● ఈ ఫ్లైఓవర్‌ పనులు పూర్తయితే అటు ఎస్‌పీ రోడ్‌, ఇటు ఎంజీ రోడ్‌లోనూ ట్రాఫిక్‌కు ఎంతో ఉపశమనం కలుగుతుంది. అప్పట్లోనే రైల్వే శాఖ నుంచి అనుమతులున్నా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దాదాపు 7.5 మీటర్లుండే ఫ్లై ఓవర్‌పై రెండు వైపులా క్యారేజ్‌వేలతోపాటు ఫుట్‌పాత్‌లు, సెంట్రల్‌ మీడియన్‌లు గత ప్రతిపాదనల్లో ఉన్నాయి. అవసరమైతే మార్పుచేర్పులు చేయనున్నారు.

ఫ్లైఓవర్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఇలా..

2009లో ఉమ్టా సమావేశంలో ఈ ప్రాజెక్టు కయ్యే వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ చెరిసగం భరించాలని, పనులు హెచ్‌ఎండీఏ చేయాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ ఇవ్వాల్సిన నిధులు జీహెచ్‌ఎంసీ ఇవ్వలేదు. హెచ్‌ఎండీఏ సైతం నిధులివ్వలేమని, ప్రాజెక్టు పని చేయలేమని, పనుల్ని జీహెచ్‌ఎంసీకి బదలాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం మెగాసిటీ ప్రాజెక్ట్‌ కింద చేపట్టాలనుకున్నారు. ఏదీ కాలేదు. బేగంపేట, ఎంజీరోడ్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ, రైల్వే అధికారుల సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. ఫ్లై ఓవర్‌ పనులు పూర్తయితే అటు బేగంపేట, ఇటుఎంజీ రోడ్లలో రద్దీ తగ్గనున్నందున మెహిదీపట్నం– సికింద్రాబాద్‌ రాకపోకల సమయం సైతం తగ్గనుందని అధికారులు పేర్కొన్నారు.

బేగంపేట్‌లో తప్పనున్న ట్రాఫిక్‌ చిక్కులు

త్వరలో పాటిగడ్డ– నెక్లెస్‌ రోడ్డు ఆర్‌ఓబీ పనులు

పుష్కర కాలం నాటి ప్రతిపాదనలకు మోక్షం

ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement