
సాక్షి, సిటీబ్యూరో: హంగేరీలోని ఎగర్‌లో జరగనున్న 18వ ప్రపంచ సుడోకు ఛాంపియన్ షిప్, 32వ ప్రపంచ పజిల్ ఛాంపియన్ షిప్‌లో నగరానికి చెందిన తండ్రి కొడుకులు దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. హంగేరియన్ పజిల్లర్స్ అసోసియేషన్‌నిర్వహించే ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని గ్లోబల్ ఎడ్జ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, తన కుమారుడు కార్తీక్‌రెడ్డితో కలిసి ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనున్న ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 24 గంటల పజిల్ ఛాంపియన్ షిప్ కూడా ఉంటుంది.
అనుభవజ్ఞుడైన పజిల్ ఔత్సాహికులు జైపాల్‌రెడ్డి మొదట 2007లో అధికారిక పజిల్ పోటీల్లో భాగస్వామ్యమయ్యారు. తన పాఠశాల రోజుల నుంచి పజిల్స్ అంటే చాలా ఇష్టమని ఆయన గుర్తు చేసుకున్నారు. భారతదేశం అంతటా ప్రాంతీయ రౌండ్లలో పాల్గొన్న తర్వాత 2008 నాటికి జాతీయ జట్టులో స్థానం సంపాదించానని, ప్రస్తుతం అంతర్జాతీయ పజిల్ పోటీలలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నానని తెలిపారు. ప్రస్తుతం 23 ఏళ్ల కార్తీక్‌రెడ్డి ఈ అభిరుచిని వారసత్వంగా పొందారని, 2015లో ప్రారంభించిన తన ప్రయాణం త్వరితగతిన అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. వీరు దివంగత కాంగ్రెస్ నాయకుడు ఎం.బాగారెడ్డి వారసులు కావడం విశేషం.