
‘బంగ్లా’ నుంచి వచ్చి బ్లాక్‌మెయిలింగ్స్!
సాక్షి, సిటీబ్యూరో: బంగ్లాదేశ్‌కు చెందిన రీతూ మోని బతుకుతెరువు కోసం అక్రమంగా నగరానికి వచ్చింది. రీతూ రావుగా మారి ఇక్కడే ఉంటూ సోషల్‌మీడియా ద్వారా ఎర వేసి పలువుర్ని ఆకర్షించింది. ఇద్దరితో సహజీవనం చేసిన ఆమె మరో వివాహితుడిని వివాహం చేసుకుంది. వీరిలో ఒకరి చిరునామాతో ఆధార్ కార్డు, పాన్‌కార్డు తీసుకుని... మరొకరి చిరునామాతో అప్‌డేట్ చేయించింది. ఈమె వ్యవహారం నాటకీయంగా వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసిన నల్లకుంట పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
ఒకరి తర్వాత మరొకరితో...
అక్రమంగా సరిహద్దులు దాటిన రీతూరావు 2020లో హైదరాబాద్ చేరుకుంది. ఉద్యోగం కోసం వచ్చినట్లు ఇక్కడ నివసిస్తూ సోషల్‌మీడియా ద్వారా ఆసిఫ్‌నగర్‌కు చెందిన నరేష్‌ను పరిచయం చేసుకుంది. అతడితో కొన్నాళ్లు సహజీవనం చేసిన రీతూ..ఆసిఫ్‌నగర్ చిరునామాతో ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకుంది. ఈ చిరునామాతోనే సిమ్‌కార్డులు సంగ్రహించింది. కొన్నాళ్లకు సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన గన్‌ఫౌండ్రీ వాసి శంకర్‌రావు వద్దకు చేరింది. ఆ సందర్భంలో తన ఆధార్ కార్డును గన్‌ఫౌండ్రీ చిరునామాకు అప్‌డేట్ చేసుకుంది. ఈమె ధోరణి కారణంగా శంకర్ తరచు ఘర్షణకు దిగేవాడు. ఓ దశలో అతడిని భయపెట్టడానికి ఇంట్లోనే షాంపూ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో శంకర్ ఆమెను గుడిమల్కాపూర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. దీనిపై గుడిమల్కాపూర్ ఠాణాలో కేసు నమోదైంది.
ఆస్పత్రిలో వదిలి వెళ్లిపోవడంతో...
నరేష్, శంకర్‌లతో సహజీవనం చేస్తున్న సందర్భంలోనే రీతూ నిజామాబాద్‌కు చెందిన ప్రవీణ్‌ను ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం చేసుకుంది. ఓ సందర్భంలో వీరిద్దరూ నగరంలోని ఓయో రూమ్‌లో గడిపారు. తాను గుడిమల్కాపూర్ ఆస్పత్రిలో ఉన్నానని, శంకర్ వదిలేసి వెళ్లిపోయాడంటూ రీతూ ప్రవీణ్‌కు ఫోన్ చేసింది. ఆస్పత్రికి వెళ్లిన అతడు బిల్లు చెల్లించిన ఆమెను తీసుకుని వెళ్లి విద్యానగర్‌లోని తన ఫ్లాట్‌లో ఉంచాడు. కొన్నాళ్లు సహజీవం చేసినా.ఆమె ఒత్తిడి మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 15న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు. ఓ సందర్భంలో ఆమెకు సంబంధించిన బంగ్లాదేశీ గుర్తింపు పత్రాలను అతడు చూశాడు. నిలదీయగా రీతూ సైతం అసలు విషయం చెప్పింది. అదే సమయంలో పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో భయపడిపోయిన ప్రవీణ్ ఆమెను వదిలి నిజామాబాద్ వెళ్లిపోయాడు.
రీతూ రావుగా మారిపోయిన రీతూ మోనీ
సోషల్ మీడియా ద్వారా పురుషులకు ఎర
ఇద్దరితో సహజీవనం..మరొకరితో పెళ్లి
స్థానికురాలిగా దరఖాస్తు చేసి గుర్తింపు కార్డులు..
నాటకీయంగా వెలుగులోకి వచ్చిన వైనం
ఇద్దరిని అరెస్టు చేసిన నల్లకుంట పోలీసులు
భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి...
తనను విడిచి వెళ్లిపోయిన ప్రవీణ్‌ను తన దారికి తెచ్చుకోవాలని భావించిన రీతూ అతడి భార్యకు సోషల్‌మీడియా ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఆమె యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రవీణ్‌తో అయిన పెళ్లి ఫొటోలు షేర్ చేసింది. వీటిని చూసిన ప్రవీణ్ భార్య షాక్‌కు గురై భర్తను నిలదీసింది. నిజం చెప్పిన అతడు ప్రస్తుతం రీతూ డబ్బు కోసం వేధిస్తోందని, బెదిరిస్తోందని వాపోయాడు. దీంతో ఇద్దరూ కలిసి వచ్చి నల్లకుంట ఠాణాలో రీతూపై ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా రీతూను పోలీసులు ఠాణాకు పిలిపించారు. ఆమె విచారణ నేపథ్యంలోనే బంగ్లాదేశీగా గుర్తించారు. న్యాయనిపుణుల సలహా మేరకు డిపోర్టేషన్ చేయాలని నిర్ణయించుకుని షెల్డర్ హోమ్‌కు తరలించారు. అయితే ఆమె ఆధార్, పాన్ కార్డులు పొందినట్లు తేలడంతో బుధవారం కేసు నమోదు చేశారు. రీతూతో పాటు ఆమెను వివాహం చేసుకుని వదిలేసిన ప్రవీణ్‌ను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నరేష్, శంకర్ కోసం గాలిస్తున్నారు.