
విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
హిమాయత్‌నగర్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుని.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ(కేఎంఈఎస్) 85వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. యువత భవిష్యత్ కోసం ప్రధాని మోదీ బంగారు బాటలు వేస్తున్నారని అన్నారు. యువత అవకాశాలు అందిపుచ్చు కోవాలని, కష్టపడి చదివి లక్ష్యం వైపు ముందుకు సాగాలన్నారు. అన్ని రంగాలలో ఏఐ, చాట్ జీపీటీ తదితర ఆధునిక టెక్నాలజీ దూసుకు పోతుందన్నారు. దేశంలో ప్రధాన నాగరాలలో సెమీ కండక్టర్స్, తదితర ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తిని చేపడుతున్నట్లు తెలిపారు. మోదీ ఆవిష్కరించిన ఏఐ చిప్‌లలో కేశవ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్‌కు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో విద్యారంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని, మెడికల్, ఇంజినీరింగ్ తదితర సీట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కేఎంఈఎస్ లాంటి అనేక విద్యా సంస్థలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయన్నారు. అమెరికా, అస్ట్రేలియా నుంచి వచ్చి భారత్‌లో చదువుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అనంతరం విద్యారంగం, ఎన్‌సీసీ, క్రీడలు, ఎన్‌ఎస్‌ఎస్, స్వచ్ఛంద సేవా రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి, ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి బంగారు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.