
వెతుకులాట!
స్థలాల కోసం
సాక్షి, సిటీబ్యూరో: కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణానికి స్థల లభ్యత ప్రధాన అడ్డంకిగా మారింది. సబ్‌స్టేషన్లు నిర్మించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిద్ధంగా ఉన్నప్పటికీ.. నిర్మాణాలకు అవసరమైన భూములు అందుబాటులో లేకపోవడం, రెవెన్యూ యంత్రాంగం కేటాయించిన భూములపై వివాదాలు కొనసాగుతుండటం, పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు పెంచక పోవడంతో కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణ ప్రక్రియ ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నచందంగా మారింది.
అనువుగా లేకపోవడం, వివాదాలు కొనసాగడం..
● పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్ల పరిధిలో రూ.420 కోట్ల అంచనా వ్యయంతో వచ్చే ఏడాది చివరి నాటికి 88 కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో భూములను కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాసింది. కోర్‌సిటీలో అనువైన భూములు లేకపోవడం, ఉన్నవి కూడా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోవడం, శివారు ప్రాంతాల్లో కేటాయించిన భూములపై కూడా పలు వివాదాలు కొనసాగుతుండటం తదితర కారణాలతో టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఔత్సాహిక కంపెనీలు ముందుకు రాకపోవడంలేదు. విధిలేని పరిస్థితిల్లో డిస్కం సర్కిళ్ల వారీగా టెండర్లు ఆహ్వానించింది. ఇప్పటి వరకు ఆరు సబ్‌స్టేషన్లకు టెండర్లు ఖరారు చేయగా, తాజాగా మరో నాలుగు సబ్ స్టేషన్లకు టెండర్లు ఆహ్వానించింది.
● కోర్‌సిటీ పరిధిలో సబ్‌స్టేషన్లకు భూముల కొరత ప్రధాన అడ్డంకిగా మారింది. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ.. డిస్కంకు కేటాయించిన భూముల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. కొన్ని కోర్టు పరిధిలో ఉండగా, మరికొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. వీటిని విడిపించి డిస్కం ఇంజినీర్లకు అప్పగించడంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. భూములు కేటాయిస్తే.. కేవలం ఏడాది లోపే సైబర్‌సిటీ సర్కిల్ పరిధిలో సబ్‌స్టేషన్‌లు నిర్మించనున్నారు.
విద్యుత్ సబ్‌స్టేషన్లకు భూములు కరువు
సర్కిళ్ల వారీగా డిస్కం టెండర్లు
ముందుకు రాని కాంట్రాక్టర్లు
వీటికి ఓకే..
మేడ్చల్ జోన్‌లో.. హబ్సిగూడ సర్కిల్ పరిధిలోని సబ్‌స్టేషన్లకు ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఏ వివాదం లేని భూములు ఉండటం ఇక్కడ కలిసి వచ్చిన అంశం. వెంకటాపూర్, మేడిపల్లి సహా మేడ్చల్ సర్కిల్ పరిధిలో శంభీపూర్, సాయినగర్, అంతాయిపల్లి ఐడీఓసీ, షాపూర్‌నగర్‌లలో కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించనున్నారు. సంగారెడ్డి సర్కిల్ పరిధిలోని పోచారం, లక్డారం, పెద్దాపూర్, సదాశివపేట్, సింఫనీ పార్క్‌కాలనీ, అందోల్, రాజంపేట్, ఆరుట్ల, జహీరాబాద్ రైల్వేస్టేషన్, గోపనపల్లి, గుడిపల్లి, తిమ్మాపూర్‌లలో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.