
అడ్మిషన్ల భర్తీకి శ్రీకారం
● బీసీ సంక్షేమ బాలుర గృహంలో 100 సీట్లు
● నాణ్యమైన భోజనంతో పాటు వసతి
● తుక్కుగూడలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
తుక్కుగూడ: బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేసింది. వీటిలో భాగంగా తుక్కుగూడ పురపాలిక కేంద్రంలో బాలుర గృహం కలదు. ఇందులో విద్యార్థుల సంఖ్య పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనికోసం కొత్తగా చేరబోయే వారికి పలు రకాల వసతులను కలిపించనున్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య ప్రతీ ఏటా తగ్గుతూ వస్తోంది. దీంతో ఈ గృహంలో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రవేశాల కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు.
మూడో తరగతి నుంచి..
బాలుర వసతి గృహంలో మూడోతరగతి నుంచి పదోతరగతి వరకు 100 మందికి ప్రవేశం కల్పించే అవకాశం ఉంది. రెండు, మూడేళ్ల నుంచి పూర్తి స్థాయిలో విద్యార్థులు చేరకపోవడంతో కొన్ని సీట్లు మిగిలిపోయేవి. తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో ప్రస్తుతం 50శాతం పైగా విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ప్రవేశాలే లక్ష్యంగా అధికారులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఇతర మండలాలకు చెందిన వారికి సైతం ప్రవేశం కల్పించనున్నారు. స్థానికంగా ఉండే పాఠశాలలకు, తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. వసతిగృహంలో చేరేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ వసతి గృహంలో 100 మంది విద్యార్థుల్లో బీసీలకు 75 సీట్లు, ఎస్సీలకు 15సీట్లు, ఎస్టీలకు 5 సీట్లను కేటాయించారు.
పౌష్టికాహారం అందజేత..
విద్యార్థులకు వసతితో పాటు, నాణ్యమైన భోజనాన్ని నిత్యం అందించనున్నారు. గతంలో విద్యార్థులకు మెస్ చార్జీల రూపేణ ఒక్కరిపై రూ.1,100లు ఖర్చు చేస్తుండేది. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుకూలంగా రూ.2,150 వెచ్చించనుంది. దీంతో విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం వడ్డించనున్నారు.
ప్రతీరోజు..
ఉదయం 7గంటలకు రాగిజావ, పాలు. అనంతరం గంట తరువాత బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఉప్మా, పులిహోర, కిచిడి రసం, చపాతి, పూరీ, ఇడ్లీ, జీర రైస్, టమాట అన్నం ఇలా రోజుకోరకంగా అందజేయనున్నారు. మధ్యాహ్నం పాఠశాలలో భోజనం ఉంటుంది. సాయత్రం ఐదు గంటలకు స్నాక్స్ పల్లిపట్టి, అటుకులు, బిస్కెట్స్, శనగలు, బొబ్బర్లు తదితర పదార్థాలు అందించనున్నారు. గతంలో వారానికి రెండు గుడ్లు, అరటిపండ్లు ఇచ్చేవారు. ఇప్పుడు వారంలో ఐదు రోజుల పాటు ఇవ్వనున్నారు. వారంలో ఆదివారం చికెన్ ఉంటుందని అధికారులు తెలిపారు. దీనికి తోడు విద్యార్థులకు మూడోతరగతి నుంచి ఏడోతరగతి వరకు రూ.150, 8నుంచి 10వ తరగతి వరకు రూ.200 కాస్మొటిక్ ఛార్జీలను ప్రభుత్వం చెల్లించనుంది.
సద్వినియోగం చేసుకోవాలి
తుక్కుగూడ బీసీ బాలుర సంక్షేమ వసతిగృహంలో 100 సీట్లు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి విసృత్తంగా ప్రచారం చేస్తున్నాం. మొత్తం సీ ట్లను భర్తీ చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. అర్హులైన విద్యార్థులు వసతిగృహాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– జగదీశ్ కుమార్, బీసీ, బాలుర వసతి గృహ సంక్షేమ అధికారి, తుక్కుగూడ