భవిష్యత్‌లో ఠాణాలుగా మారుస్తాం | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌లో ఠాణాలుగా మారుస్తాం

May 30 2025 7:02 AM | Updated on May 30 2025 7:02 AM

భవిష్యత్‌లో ఠాణాలుగా మారుస్తాం

భవిష్యత్‌లో ఠాణాలుగా మారుస్తాం

మొత్తం ఏడింటిని ఏర్పాటు చేసిన కొత్వాల్‌

రూ.లక్ష లోపు కోల్పోయిన కేసుల దర్యాప్తు

సాక్షి, సిటీబ్యూరో: సైబర్‌ బాధితులకు మరింత ఊరట ఇచ్చేలా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని ప్రతి జోన్‌కూ ఒక జోనల్‌ సైబర్‌ సెల్‌ (జెడ్‌సీసీ) ఏర్పాటు చేశారు. గురువారం బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌లో మోడల్‌ సైబర్‌ సెల్‌ను కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ నేరుగా, జోన్లలో ఏర్పాటు చేసిన ఏడింటిని వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.లక్ష లోపు మొత్తంతో ముడిపడి ఉన్న కేసుల దర్యాప్తు జెడ్‌సీసీ పర్యవేక్షణలో జరగనుంది. వీటి పనితీరుకు సంబంధించి ప్రత్యేకంగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ సైతం రూపొందించారు.

సైబర్‌ ఠాణాపై పని భారం..

నానాటికీ పెరిగిపోతూ దర్యాప్తు అధికారులకు సవాల్‌ విసురుతున్న సైబర్‌ నేరాలు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఆర్థికాంశాలతో ముడిపడి ఉన్న కేసుల్లో నిందితులుగా బయటి రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు చెందిన ఓ బృందం అనునిత్యం బయటి రాష్ట్రాల్లో ఉంటోంది. ఎన్ని వ్యయప్రయాసలకోర్చినా పాత్రధారులు, దళారులు తప్ప సూత్రధారులు చిక్కట్లేదు. ఈ కారణంగానే ఇటీవల సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బాధితులు కోల్పోయిన నగదు ఫ్రీజ్‌ చేయడానికి, రీఫండ్‌ చేయించడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌ క్రైమ్‌ ఠాణా తీవ్ర పని ఒత్తిడి ఎదుర్కొంటోంది.

రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు..

సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌పై పని భారం తగ్గించడానికి రూ.లక్ష కంటే తక్కువ మొత్తంతో ముడిపడి ఉన్న కేసుల్ని స్థానిక పోలీసు స్టేషన్లలో నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి కేసులు నమోదు అవుతున్నా... ఆ అధికారులకు ఉండే దైనందిన విధులు, బందోబస్తు డ్యూటీల కారణంగా దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగట్లేదు. మరోపక్క అక్కడి అధికారులకు ఈ కేసుల్ని దర్యాప్తు చేసే పరిజ్ఞానం, తీరుతెన్నులపై అవగాహన ఉండట్లేదు. ఫలితంగా బాధితులు నష్టపోతున్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ జెడ్‌సీసీలను ఏర్పాటు చేశారు. జోనల్‌ డీసీపీల నేతృత్వంలో పని చేసే వీటిలో విధులు నిర్వర్తించే వారికి నెల రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ జెడ్‌సీసీలు రూ.25 వేల కంటే తక్కువ మొత్తంతో ముడిపడి ఉన్న నేరాల్లో నగదు ఫ్రీజ్‌ అయి ఉంటే రిఫండ్‌ చేయిస్తారు. రూ.25 వేల నుంచి రూ.లక్ష మధ్య మొత్తంతో ముడిపడిన వాటిపై స్థానిక ఠాణాలో కేసు నమోదు చేయిస్తారు. రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడి ఉన్న వాటిని సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు పంపిస్తారు. జెడ్‌సీసీలు స్థానిక పోలీసుస్టేషన్లలో నమోదయ్యే సైబర్‌ నేరాలను దర్యాప్తు చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న నిందితులను పట్టుకోవడంలో సహకరిస్తారు. సోషల్‌మీడియా వేధింపులు కేసుల్లో నిందితులు అపరిచితులైతే సైబర్‌ ఠాణాలో కేసు నమోదు చేయిస్తారు.

నగరంలో సైబర్‌ నేరాలు పదేళ్లల్లో పది రెట్లు పెరిగాయి. 2015లో 351 కేసులు నమోదు కాగా.. గత ఏడాది ఆ సంఖ్య 3111కు చేరింది. సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో 147 పోస్టులు ఉండగా.. 120 మందే అందుబాటులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జెడ్‌సీసీలు ఏర్పాటు చేశాం. రెండుమూడేళ్ల పాటు వీటి పనితీరును అధ్యయనం చేసి, ఆపై ఠాణాలుగా మారుస్తాం. కేసుల నమోదు, దర్యాప్తులతో పాటు ఫ్రీజ్‌ అయిన మొత్తం రిఫండ్‌ ప్రక్రియ సులభతరం కానున్నాయి.

– సీవీ ఆనంద్‌, నగర కొత్వాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement