
428
ప్రమాదాలు జరిగితే అధికారులదే బాధ్యత
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
లక్డీకాపూల్: గ్రేటర్‌లోని శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించిన నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం శిథిలావస్థలో ఉన్న గృహాలు,సెల్లార్ నిర్మాణాలపై జోనల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వర్షాలు ముందుగానే కురుస్తాయని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న గృహాల్లో నివసించే కుటుంబాలకు అవగాహన కల్పించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రేటర్‌లో ఇప్పటి వరకు శిథిలావస్థకు చేరిన 428 కట్టడాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. వీటిలో 131 గృహాలకు మరమ్మతులకు అవకాశం ఉందని, మిగతా 297 నిర్మాణాలకు నోటీసులు జారీ చేయాలన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి వర్షాకాలం ముగిసే వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త సెల్లార్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నిర్మించిన సెల్లార్ల విషయంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం, బారికేడ్లు నిబంధనల ప్రకారం ఉండేలా జాగ్రత్త తీసుకునేలా, సెల్లార్‌లో నీరు నిలవకుండా యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు.